పొడవని పొత్తుతో డైలమాలో వామపక్షాలు

వామపక్షాలు కోరుతున్న సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. దీంతో వారికి ఆయా సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు.

Advertisement
Update:2023-11-02 06:04 IST

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాల పొత్తు ఉంటుందా.. లేదా అనే డైలమాకు తెరపడటం లేదు. సీపీఐ, సీపీఎంతో పొత్తు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందడం లేదు. అదే సమయంలో వామపక్షాలు కోరిన సీట్లకు సంబంధించి కొన్ని టికెట్లు కూడా కాంగ్రెస్ ప్రకటించింది. పొమ్మనలేక పొగపెడుతున్నా.. వామపక్ష పార్టీలు మాత్రం ఇంకా పొత్తు ఉంటుందనే ఆశతోనే ఉన్నాయి. సీపీఐ నాయకులు మాత్రం ఒకట్రెండు రోజుల్లో పొత్తు ఖరారవుతుందని ఆశిస్తుండగా.. సీపీఎం మాత్రం గురువారం మధ్యాహ్నం లోగా పొత్తు ఖరారు చేయాలని.. లేకపోతే తాము ఒంటరిగా పోటీ చేస్తామని అల్టిమేటం జారీ చేశాయి.

వామపక్షాలు కోరుతున్న సీట్లలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది. దీంతో వారికి ఆయా సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కమ్యూనిస్టులు కోరుతున్న సెగ్మెంట్లలోని నాయకులు, కార్యకర్తలు వారికి టికెట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. తొలుత సీపీఐ కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు టికెట్లను కోరింది. అయితే హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌కు, మునుగోడు టికెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. చెన్నూరు, కొత్తగూడెం టికెట్లను మాత్రం ఇంకా ఎవరికీ ప్రకటించలేదు. ఈ రెండు స్థానాలను సీపీఐకి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

చెన్నూరు నుంచి గడ్డం వంశీ, ఓయూ జేఏసీ నేత దుర్గం భాస్కర్ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను ఓడించాలంటే బలమైన యువ నాయకుడి అవసరం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఆ టికెట్ తమకే కేటాయిస్తారని సీపీఐ అంటోంది. తాజాగా పార్టీలో చేరిన జి. వివేక్ తమనకు సహకరిస్తారని సీపీఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ వస్తుందని సీపీఐ ధీమాగా ఉన్నది.

సీపీఎం మాత్రం గురువారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌కు టైం ఇచ్చింది. ఈ లోగా పొత్తుపై తేల్చకుంటే తెలంగాణలో ఒంటరిగానే పోటీకి దిగుతామని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాకు స్పష్టం చేశారు. సీపీఎం కోసం వైరా, మిర్యాలగూడ స్థానాలను కాంగ్రెస్ పక్కకు పెట్టింది. అయితే కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరా టికెట్‌ను తన అనుచరుల కోసం అడుగుతున్నారు. ఆ స్థానంలో విజయాబాయిని దింపితే తప్పకుండా గెలిపిస్తానని అధిష్టానికి చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది.

మరోవైపు మిర్యాలగూడ నుంచి కాంగ్రెస్ నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డి కోరుతున్నారు. అదే స్థానం నుంచి సీపీఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. సీపీఎం అడుగుతున్న రెండు సీట్లలో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు ఉన్నారు. దీంతో సీపీఐ, సీపీఎం కోసం కాంగ్రెస్ ప్రస్తుతానికి ప్రకటించని సీట్లపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇవ్వాళో రేపో కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News