రసవత్తరంగా ఎల్బీనగర్ రాజకీయం
నల్గొండ నుంచి వచ్చి స్థిరపడినవారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకునే ఓటర్లే ఇక్కడ కీలకం. ఇందులోనూ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండటంతో కాంగ్రెస్‌కు ప్లస్‌పాయింట్ అవుతూ వచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు చాలామంది ప్రముఖులు పోటీపడుతుండటంతో ఇప్పటికే వార్తల్లో నిలిచింది. దీనికితోడు ఇప్పుడు అధికార బీఆర్ఎస్ నుంచి కీలక నేత, గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం మరింత రంజుగా మారింది.
నల్గొండ ఓటర్లు, సెటిలర్ల ప్రభావమే ఎక్కువ
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై విస్తరించి ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం డీలిమిటేషన్‌లో భాగంగా 2008లో ఏర్పడింది. అప్పటి నుంచి మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్‌లే గెలిచాయి. నల్గొండ నుంచి వచ్చి స్థిరపడినవారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి వివిధ వృత్తులు, వ్యాపారాలు చేసుకునే ఓటర్లే ఇక్కడ కీలకం. ఇందులోనూ రెడ్డి సామాజికవర్గం ఓట్లు ఎక్కువ ఉండటంతో కాంగ్రెస్‌కు ప్లస్‌పాయింట్ అవుతూ వచ్చింది. 2014లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం పొందిన బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య ఆ పార్టీ నుంచి గెలుపొందారు. 2018 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఓటు బ్యాంకు కలిసొచ్చి కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై రెండు వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు.
అభ్యర్థులు అటు ఇటవుతారా?
2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్‌రెడ్డి తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు సుధీర్‌రెడ్డితో పార్టీలో పొసగక రామ్మోహన్ గౌడ్ తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఒకవేళ ఆ పార్టీ టికెట్ దక్కించుకుంటే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు అటు ఇటు అయినట్లన్నవుతుంది. కానీ కాంగ్రెస్‌లో ఈ టికెట్‌కు ఇప్పటికే పోటీ ఉంది. మధుయాస్కీ లాంటి కీలక నేతలు ఇక్కడ టికెట్ కోరుతున్నారు. వాళ్లను కాదని రామ్మోహన్ గౌడ్‌కు టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. బీఆర్ఎస్ నేతగా దశాబ్దకాలంగా ఎల్బీనగర్ శ్రేణులకు సుపరిచితమైన రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరడం ఎవరికి లాభం చేకూరుస్తుందన్నది వేచి చూడాలి.