రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలే కీలకం

పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం రేవంత్‌

Advertisement
Update:2024-10-21 10:52 IST

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలే కీలకమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గోషామహల్‌ స్టేడియంలో పోలీసు సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..విధినిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిది అన్నారు. పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉన్నది. పోలీసులు, వారి కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలి. ఎవరిముందో చేయిచాచే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతున్నాను. విమర్శలకు అవకాశం ఇవ్వవద్దని సీఎం పోలీసులను కోరారు. విధి నిర్వహణలో పోలీసులకు ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు ఖర్చులు, ఇతర ఏర్పాట్ల కోసం నిధులు కేటాయిస్తామన్నారు. ఖద్దరును, ఖాకీని ఈ సమాజం నిశితంగా గమనిస్తున్నదని గుర్తించాలన్నారు. తెలంగాణ పోలీసుల విధానాలను ఇతర రాష్ట్రాలు పాటిస్తున్నాయి. మన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇవాళ డ్రగ్స్‌ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నది. వీటి కట్టడికి సరికొత్త చర్యలు తీసుకుంటామనని సీఎం తెలిపారు.రాష్ట్రంలో సైబర్‌ నేరాలు బాగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. దేవాలయాలు, మసీదులపై మీద దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలు చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు. పోలీసుల పిల్లలకు 50 ఎకరాల్లో యంగ్‌ ఇండియా స్కూల్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి యంగ్‌ ఇండియా స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభమౌతాయన్నారు. చనిపోయిన పోలీసుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.

డీజీపీ జితేందర్‌ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడటానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. టీజీ న్యాబ్‌ ద్వారా నార్కోటిక్స్‌ నియంత్రిస్తున్నామన్నారు. నేరాలను అరికట్టడానికి రాష్ట్ర పోలీసులు కట్టుబడి ఉన్నారని చెప్పారు.

విధి నిర్వహణలో ఆధునిక సాంకేతిక వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తెలుగు, ఇంగ్లీష్‌ , ఉర్దూలో వ్యాసరచన పోటీలు జరిగాయి. పీఎస్‌ల పరిధిలో రక్తదాన శిబిరాలు, సైకిల్‌ ర్యాలీల నిర్వహించారు. పోలీసు కళా బృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళా జాతర జరగనున్నది. 

Tags:    
Advertisement

Similar News