నా వాళ్లు నలుగురు.. అయితే మా వాళ్లు ఇద్దరు

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం.

Advertisement
Update:2024-06-27 13:01 IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ వీడటం లేదు. నేతల మధ్య సమన్వయం కొరవడటంతో కేబినెట్ బెర్తుల ఖరారులో జాప్యం జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేయడంపై నేతలంతా దృష్టి సారించారు. గడిచిన 3 రోజులుగా సీఎం సహా కీలక మంత్రులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలతో సమావేశమయ్యారు. ఈ భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్‌ మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేబినెట్‌ విస్తరణ జాప్యం అవుతోంది. అంతా ఓ క్లారిటీ వచ్చి, చర్చించుకుని మరోసారి ఢిల్లీకి వస్తే ఫైనల్ లిస్టు ప్రకటిద్దామని అధిష్టానం చెప్పినట్లు సమాచారం.

మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి నలుగురి పేర్లను హైకమాండ్‌కు ప్రపోజ్‌ చేసినట్లు సమచారం. మంత్రివర్గంలో ప్రాధాన్యం లేని నిజామాబాద్‌ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డిని, ముదిరాజ్‌ సామాజికవర్గం నుంచి వాకిటి శ్రీహరిని, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలు నాయక్‌ని, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో ఇద్దరి పేర్లు సూచించినట్లు తెలిసింది.

రెడ్డి సామాజికవర్గం నుంచి రేసులో రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేతలంతా ఢిల్లీలోనే ఉండి సీఎం రేవంత్‌రెడ్డితో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, ప్రేమ్‌సాగర్‌రావు, బాలు నాయక్‌, షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నారు. ఒకే జిల్లా కావడంతో వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావులో ఒకరికే ఛాన్స్ ఉండనుంది. అంతా ఒక్కతాటిపైకి వస్తే శ్రావణమాసంలోనే కేబినెట్‌ విస్తరణ ఉండే ఛాన్స్. 

Tags:    
Advertisement

Similar News