తెలంగాణ మట్టిలోనే కలిసిపోతా అంటున్న కేవీపీ.. హఠాత్తుగా ఏమిటీ భావోద్వేగం?
భార్యాబిడ్డల సాక్షిగా చెబుతున్నాను.. తాను తెలంగాణవాడినేనని.. ఇక్కడ మట్టిలోనే కలిసిపోతానని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
దివంగత మాజీ సీఎం వైస్ రాజశేఖరరెడ్డి ఆత్మగా పేరుపడిన కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు నిన్న వైఎస్ వర్ధంతి సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో టాక్ ఆఫ్ ద డేగా నిలిచాయి. తెలంగాణవాడిగా కనీసం సగం తెలంగాణవాడిగానైనా గుర్తించాలంటూ కేవీపీ కామెంట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తనను కలుపుకోని పోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ పునరావాసం కోసం చేస్తున్న అభ్యర్థనా అన్న కామెంట్లూ వినిపిస్తున్నాయి.
తెలంగాణలోనే ఓటుంది
1980లో హైదరాబాద్‌కు వచ్చానని, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానని, తన ఓటూ ఇక్కడే ఉందని కేవీపీ చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రెండుసార్లు నేరేడుచర్ల వెళ్లి దెబ్బలు కూడా తినబోయానని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటేశానని, సికింద్రాబాద్‌లో అంజన్‌కుమార్ యాదవ్‌కు నాలుగుసార్లు ఓటేశానని కేవీపీ సభాముఖంగా గుర్తు చేశారు. భార్యాబిడ్డల సాక్షిగా చెబుతున్నాను.. తాను తెలంగాణవాడినేనని.. ఇక్కడ మట్టిలోనే కలిసిపోతానని ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
ఎందుకింత హఠాత్తుగా?
వైఎస్ హయాంలో అన్నీ తానై అన్నట్లుగా ఉన్న కేవీపీ ఆయన మరణానంతరం ఏపీ రాజకీయాల్లోనే ఉన్నా అంత ప్రాధాన్యం దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో దాదాపు సమాధి అయిపోయిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నేతగా ఆయనకెలాగూ పని లేదు. ఆప్తమిత్రుడి కొడుకు జగన్ పార్టీ పెట్టినా అందులోకీ వెళ్లలేదు. జగన్ రమ్మనీ అనలేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక్కడే రాజకీయంగా ఏదైనా అవకాశం దొరుకుతందని కేవీపీ లోకల్ సెంటిమెంట్ చూపించబోయారా అని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
♦