కేటీఆర్.. వర్క్ ఫ్రమ్ హోమ్
మంగళవారం కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కొన్ని ఫైల్స్‌ను పరిశీలించి పని ముగించానని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఎంతో మంది ఉద్యోగులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' పద్దతిలో పని చేశారు. అత్యవసర సేవల ఉద్యోగులు తప్ప, మిగిలిన వాళ్లందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానే పనులు చక్కబెట్టారు. కరోనా తగ్గిపోవడంతో ఇప్పుడు చాలా మంది తిరిగి కార్యాలయాల బాట పట్టారు. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం తాజగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' మోడ్ లోకి వెళ్లిపోయారు.
కేటీఆర్‌కు ఈ నెల 23న కాలు బెణికి ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్లు మూడు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఆ రోజు నుంచి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. 24న కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు కూడా చేసుకోలేదు. సోషల్ మీడియా ద్వారా తనకు విషెస్ చెప్పిన వందలాది మందికి ఓపికగా కూర్చొని రిప్లైలు ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక తాజగా ఆయన ఇంటి దగ్గర నుంచే కొన్ని అత్యవసరమైన పనులను చక్కబెడుతున్నారు.
కేటీఆర్‌ను సాయం కావాలని అభ్యర్థించిన చాలా మందికి ట్విట్టర్ ద్వారా బదులు ఇచ్చారు. తన కార్యాలయ సిబ్బంది, వ్యక్తిగత టీమ్‌ను అలర్ట్ చేసి వారికి సాయం చేయాలని ఆదేశించారు. పలు వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు తన ఆపన్నహస్తం అందించారు. ఇక ఇప్పుడు రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాటిపై దృష్టి పెట్టారు.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో రెండు రోజుల నుంచి రాత్రి పూట కురుస్తున్న వర్షాలకు పాత నగరం సహా పలు బస్తీలు జలమయం అయ్యాయి. మూసీ పొంగి ప్రవహిస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయ్యింది. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఇంటి దగ్గర నుంచే సమన్వయం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పలు ఫైల్స్‌ను క్లియర్ చేస్తున్నారని.. పాలనకు ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులకు కేటీఆర్ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తున్నది.
మంగళవారం కేటీఆర్ ఇంటి దగ్గర నుంచి పనిచేస్తున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కొన్ని ఫైల్స్‌ను పరిశీలించి పని ముగించానని ఆయన పేర్కొన్నారు. #WorkFromHome అంటూ హ్యాష్ ట్యాగ్ జత చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాలుకు గాయం ఉన్నా కూడా పని చేస్తున్నారంటూ అభిమానులు కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.