3సార్లు జీతాలు పెంచాం.. భవిష్యత్ లోనూ అండగా ఉంటాం

కార్మికులు కేటీఆర్ తో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు. ఆయనకు తమ కష్టాలు చెప్పుకున్నారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement
Update: 2024-01-02 03:15 GMT

పట్టణాలు, పల్లెల పరిశుభ్రతలో అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. తమ హయాంలో మూడుసార్లు జీతాలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులతో కలసి తెలంగాణ భవన్ లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్.

సహపంక్తి భోజనం..

పారిశుధ్య కార్మికులంతా విధి నిర్వహణలో తాము ధరించే యూనిఫామ్ లోనే ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వారితో కలసి సహపంక్తి భోజనం చేశారు కేటీఆర్. వారితో చాలాసేపు ముచ్చటించారు, సెల్ఫీలు దిగారు. కార్మికులు కేటీఆర్ తో మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు. ఆయనకు తమ కష్టాలు చెప్పుకున్నారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జీతాల పెంపుతోపాటు అరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో తమకు కూడా మెడికల్‌ లీవ్‌ సౌకర్యం ఇచ్చేలా కృషి చేయాలన్నారు.

5గంటలసేపు తెలంగాణ భవన్ లోనే..

నాయకులైనా, సామాన్యులైనా.. నూతన సంవత్సరం తొలిరోజు కుటుంబంతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కేటీఆర్ మాత్రం తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 5 గంటలసేపు ఆయన అక్కడే ఉన్నారు. పారిశుధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేసి, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారి సమస్యలను హైదరాబాద్ మేయర్‌ విజయలక్ష్మి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News