తెలంగాణలో బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్..!

రేపు జరగబోయే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడమే కాకుండా, జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా కేటీఆర్ ఉండబోతున్నారు.

Advertisement
Update:2022-10-04 17:39 IST

మరి కొన్ని గంటల్లో కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన ప్రకటన చేయబోతున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతోనే కొత్త పార్టీ ఉండబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరికీ సమాచారం అందింది. బుధవారం పార్టీ సమావేశంలో బీఆర్ఎస్‌కు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగియడంతో పాటు బీఆర్ఎస్ వెలుగులోకి రానుంది. పార్టీ స్వరూపంపై ఇప్పటికే కేసీఆర్ పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. తెలంగాణ సహా మిగిలిన రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను ఎవరెవరు నడిపిస్తారనే విషయంలో కూడా పూర్తి స్పష్టతతో ఉన్నారు.

రేపు జరగబోయే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీని ప్రతిపాదిస్తూ తీర్మానం చేయడమే కాకుండా, జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ఇకపై బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. అయితే, టీఆర్ఎస్ లెజిస్లేటీవ్ పార్టీ లీడర్‌గా మాత్రం కేసీఆర్ కొనసాగుతారు. టీఆర్ఎస్ఎల్పీ లీడర్ మాత్రమే సీఎంగా ఉంటారు కాబట్టి ఆ మేరకు ఆయనే ఆ పదవిలో కొనసాగుతారు. అందుకే రేపు టీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ తరపున లెజిస్లేటీవ్ పార్టీ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకోనున్నారు.

బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తూ తీర్మానించిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ రద్దయిపోతుంది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ)కి తెలియజేస్తారు. పార్టీ సీనియర్ లీడర్లు తీర్మాన పత్రాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి.. వెంటనే ఈ విషయాన్ని ఈసీఐకి చెప్తారు. పార్టీ పేరు, ప్రధాన కార్యాలయం, ఆఫీస్ బేరర్లు, ఇతర వివరాలను కూడా ఈసీఐకి అందజేస్తారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పనులు పూర్తి చేయడం ద్వారా ఈసీఐ దగ్గర పార్టీ పేరు మార్పిడి పూర్తవుతుంది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు కూడా పార్టీ పేరు మార్పిడి విషయాన్ని తెలియజేయడంతో పాటు.. కేసీఆర్‌ను బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా ఎన్నుకున్న విషయాన్ని వెల్లడిస్తారు. ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటారని తెలుస్తోంది.

2018 డిసెంబర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పని చేస్తున్నారు. పార్టీలో సీనియర్లు, జూనియర్లను కలుపుకొని పోవడంలో కేటీఆర్ విజయవంతం అయ్యారు. నేతల మధ్య ఉన్న విభేదాలను కూడా తగ్గించడంలో కేటీఆర్ చాకచక్యంగా వ్యవహరించారు. అంతే కాకుండా తరచూ తెలంగాణ భవన్‌ను సందర్శిస్తూ పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారు. గతంలోనే టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్‌ను చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల కేసీఆర్ ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేటీఆర్‌ను నియమించబోతుండటంతో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి.

Tags:    
Advertisement

Similar News