ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం -కేటీఆర్

మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేసిన సమయంలో ఎస్సీ వర్గీకరణకు చిత్తశుద్ధితో మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2024-08-01 13:43 IST

ఎస్సీ వర్గీకరణకోసం బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందని చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది తామేనన్నారు. నాడు సీఎం హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ప్రధానికి లేఖ స్వయంగా ఇచ్చారని గుర్తు చేశారు.


ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగల పోరాటం ఎట్టకేలకు విజయవంతం అయిందని అన్నారు కేటీఆర్. మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓట్ల రాజకీయం చేసిన సమయంలో ఎస్సీ వర్గీకరణకు చిత్తశుద్ధితో మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన చెప్పారు. ఇతర పార్టీల లాగా తాము రెండు వాదనలు వినిపించలేదన్నారు. వర్గీకరణకు తాము మొదటి నుంచి అనుకూలంగానే ఉన్నామని, మాదిగల తరపున పోరాటం చేసింది కూడా తామేనన్నారు కేటీఆర్. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక న్యాయ కోణంలో ఆలోచించింది ఒక్క కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.

తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో, ఎస్సీ వర్గీకరణ కూడా అంతే న్యాయమైన డిమాండ్ అని కేసీఆర్ భావించారని చెప్పారు కేటీఆర్. ఎస్సీ వర్గీకరణ తన బాధ్యత అని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఎస్సీలకు సంబంధించిన ఉప కులాల జనాభా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుందని, దానికి అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించడం శుభపరిణామమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News