అదే జరిగితే ప్రజా ఉద్యమం తప్పదు.. కేటీఆర్ వార్నింగ్.!

దక్షిణ భారతంలో లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిస్తున్నాయన్నారు.

Advertisement
Update:2023-09-26 10:28 IST

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన - డీలిమిటేషన్ అంశంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

దక్షిణ భారతంలో లోక్‌సభ సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దక్షిణ రాష్ట్రాలు దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిస్తున్నాయన్నారు. పార్లమెంట్‌ అనేది దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అని, ఇందులో దక్షిణాది రాష్ట్రాల గొంతును అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.


డీలిమిటేషన్‌ విషయంపై కేంద్రం పునరాలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతాయని ఇండియా టుడే తన నివేదికలో పేర్కొంది.

చివరిసారిగా 1971 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజించారు. అయితే 71 తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో దక్షిణాది రాష్ట్రాలు జనాభాను బాగా తగ్గిస్తూ వచ్చాయి. అదే సమయంలో ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాలు జనాభాను పెంచుతూ పోయాయి. దీంతో జనాభాను నియంత్రించిన దక్షిణ భారత రాష్ట్రాలకు లోక్ సభలో సీట్ల సంఖ్య తగ్గుతుంది. జనాభాను పెంచిన ఉత్తర రాష్ట్రాలకు లోక్ సభలో సీట్లు పెరుగుతాయి.

Tags:    
Advertisement

Similar News