అదానీతో అనుబంధమేంటి..? కేటీఆర్ సూటి ప్రశ్నలు..

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించేలా రేవంత్ చర్యలు ఉన్నాయని అన్నారు కేటీఆర్. అదానీ విషయంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Update:2024-08-12 06:38 IST

అదానీ వ్యవహారం మళ్లీ రచ్చగా మారింది. గతంలో అదానీ కంపెనీలో జరిగిన అవకతవకలను హిండెన్ బర్గ్ సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కంపెనీ షేర్ల విలువ కుప్పకూలింది. తాజాగా హిండెన్ బర్గ్ సంస్థ మరో బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ లో ఏకంగా సెబీ చైర్ పర్సన్ మాధబి పురి బచ్ పెట్టుబడులు పెట్టారంటూ లీకులిచ్చింది. దీంతో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సెబీ చైర్ పర్సన్ గా మాధబిని వెంటనే తొలగించాలని, ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేశాయి. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూప్ తో అంటకాగడమేంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు వేశారు.


కేంద్రంలో అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోంది. తెలంగాణలో మాత్రం అదే అదానీ గ్రూప్ పెట్టుబడులకోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇదెక్కడి ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు కేటీఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి ఒకటే విధానం ఉండదా అని నిలదీశారు. అసలు అదానీ కంపెనీపై కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు కేటీఆర్.

అదానీ వ్యవహారంలో మరిన్ని లోటుపాట్లు బయటపడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కూడా తెలంగాణలో అదానీ పెట్టుబడులను కొనసాగించడంపై కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వకపోవడం శోచనీయం అంటున్నారు కేటీఆర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్లో రాజీపడినట్టు అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని శంకించేలా రేవంత్ చర్యలు ఉన్నాయని తేల్చి చెప్పారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News