నెట్ సంగతి సరే, మరి నీట్ సంగతేంటి..?
దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిష్టాత్మక పరీక్షల విషయంలో ఇప్పటికే కేంద్రం అప్రతిష్ట మూటగట్టుకుంది. నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడాన్ని పక్కనపెట్టి, కప్పిపుచ్చుకునే ధోరణిలో కేంద్రం వ్యవహరించడం విశేషం.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో UGC-NET, NEET రెండూ ఉన్నాయి. ఈ ఏడాది ఈ రెండు పరీక్షల విషయంలో తీవ్ర గందరగోళం జరిగింది. NET, NEET నిర్వహణలో లోపాలున్నాయనే విషయం తేలిపోయింది. దీంతో NTA నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ముందుగా UGC-NET పరీక్షను రద్దు చేసింది. అయితే అదే ఏజెన్సీ నిర్వహించిన NEET సంగతేంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. NEET పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల వ్యవహారంపై కొన్నిరోజులుగా విద్యార్థుల తరపున సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు సంధిస్తున్న ఆయన తాజాగా NET రద్దు వ్యవహారంపై ట్వీట్ చేశారు. అదే ఏజెన్సీ నిర్వహించిన NEET విషయంలో ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందన్నారు కేటీఆర్.
వివరణ ఇవ్వాల్సిందే..
జాతీయ స్థాయి పరీక్షలపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కేంద్రం పెద్దగా స్పందించకపోవడం విశేషం. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో గ్రేస్ మార్కుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. గ్రేస్ మార్కులు ఇచ్చిన వారందరికీ మరోసారి పరీక్ష పెడతామని తేల్చి చెప్పింది. లేకపోతే పాత మార్కుల్నే పరిగణలోకి తీసుకుంటామన్నది. అయితే NEET ని రద్దు చేస్తామని మాత్రం చెప్పలేదు. ఈ దశలో ఇప్పుడు NET రద్దయింది, మరి NEET సంగతేంటనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ విషయంలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. దేశవ్యాప్తంగా 11 లక్షలమంది హాజరైన UGC-NET పరీక్షను రద్దు చేశారని, NEET విషయంలో గందరగోళం జరుగుతున్నా పట్టించుకోరేంటని అడిగారు.
దేశవ్యాప్తంగా జరిగిన ప్రతిష్టాత్మక పరీక్షల విషయంలో ఇప్పటికే కేంద్రం అప్రతిష్ట మూటగట్టుకుంది. నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడాన్ని పక్కనపెట్టి, కప్పిపుచ్చుకునే ధోరణిలో కేంద్రం వ్యవహరించడం విశేషం. దీనిపై ఇప్పటికే విపక్షాలు ఆందోళన చేపట్టాయి. తెలంగాణలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్ భవన్ ని ముట్టడించింది, ఆ పార్టీ నేతలు కూడా కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని హితవుపలికారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్, కేంద్రం వైఖరిని ఎండగడుతున్నారు.