అప్పుడు చిరునవ్వులు.. ఇప్పుడు ఛిద్రమవుతున్న బతుకులు
కాంగ్రెస్ హయాంలో చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. నేతన్నల కష్టాలు తీర్చాలంటే బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను కొనసాగించాలన్నారు.
బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు విరిశాయని, కాంగ్రెస్, బీజేపీ పాలనలో నేతన్నల బతుకులు ఛిద్రమవుతున్నాయని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆసక్తికర ట్వీట్ వేశారు. కేసిఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం లభించాయని గుర్తు చేశారు. నేతన్నలకోసం ఎన్నో విప్లవాత్మక పథకాలను గత ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు కేటీఆర్.
నరాలను పోగులుగా, రక్తాన్ని రంగులుగా వేసి, గుండెలను కండెలుగా మార్చి, చెమట చుక్కల్ని చీరలుగా మలచి, పేగులను వస్త్రాలుగా అందించి, మనిషికి నాగరికతను అద్దిన నేత్నలకు శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ సాగింది. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేతరంగానికి బీఆర్ఎస్ పాలనలోని పదేళ్లు ప్రగతి ప్రస్థానంగా మారాయని చెప్పారాయన. గత పదేళ్లు నేతన్నలకు ఓ స్వర్ణయుగం అన్నారు. నేత కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు ఆయన అని కొనియాడారు కేటీఆర్.
తేడా అదే..
సమైక్యరాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ.600 కోట్లు మాత్రమే చేనేత రంగానికి కేటాయిస్తే, బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ.1200 కోట్లు కేటాయించామని చెప్పారు కేటీఆర్. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో “చేనేత మిత్ర” ను అమలు చేశామన్నారు. నేతన్నకు చేయూత పేరుతో ప్రత్యేక పొదుపు పథకం తెచ్చామన్నారు. “నేతన్నకు బీమా” పేరుతో 5 లక్షల రూపాయల ధీమా అందించగలిగామని, 36 వేల మంది నేతన్నల కుటుంబాలకు ఇది కొండంత అండగా మారిందన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 10,150 మంది చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేశామని, మొత్తంగా రూ.29 కోట్ల రుణాలు తమ హయాంలో రద్దు చేశామని చెప్పారు కేటీఆర్.
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞంగా, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అభివర్ణించారు కేటీఆర్. సిరిసిల్లలో అప్పెరల్ పార్క్ ఏర్పాటు.. ఓ సంకల్పం అని, వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్.. ఓ సంచలనం అని చెప్పుకొచ్చారు. నేతన్నలకోసం బీఆర్ఎస్ మంచి చేస్తే.. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం తొలిసారి చేనేత వస్త్రాలపై జీఎస్టీ పన్ను విధించిందని చెప్పారు కేటీఆర్. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, ఆల్ ఇండియా పవర్ లూమ్ బోర్డుల్ని రద్దుచేసిన ఘనత ఎన్డీఏ సర్కారుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ పాలనలో, మళ్లీ చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నల కష్టాలు తీర్చాలంటే బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను కొనసాగించాలన్నారు కేటీఆర్.