గులాబీ పరివర్తన ప్రస్థానం..

ఆటుపోట్లను చూసి అదిరిపడలేదని, ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదని, గెలిస్తే పొంగిపోలేదని, ఓటములకు కుంగిపోలేదని పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ ఇదని, ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ ఇదని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2024-04-27 07:31 IST

అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పటి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. ముళ్లూ రాళ్లూ అవాంతరాలను అధిగమిస్తూ.. పార్టీ పయనం పరవళ్లు తొక్కిందని చెప్పారాయన. చావునోట్లో తలబెట్టి సాహసంగా పోరాడిన దళపతి.. కేసీఆర్ అని, లాఠీలకు..జైళ్లకు వెరవక కొట్లాడిన గులాబీ సైనికుల త్యాగ నిరతికి బీఆర్ఎస్ నిదర్శనం అని వివరించారు.


రెపరెపలాడే గులాబీ పతాకం

తెలంగాణ ఎగరేసిన జయ కేతనం..!

పర పీడన చెర విడిపించిన ఉద్యమ జెండా ..!

పసిడి కాంతులు పంచిన ఉజ్వల ప్రగతి బావుటా..!

పుట్టుకే ఒక సంచలనం..

దారి పొడవునా రాజీలేని రణం..!

అంటూ బీఆర్ఎస్ పోరాట స్ఫూర్తిని కొనియాడారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రస్థానంలో కార్యకరక్తల పాత్రను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. జెండా మోసి.. జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం..బలగం..!కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న మీ పట్టుదలకు ..మీ శ్రమకు.. మీ కృషికి..సదా సలాం..! ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం..! అంటూ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేశారు కేటీఆర్.

జలదృశ్యంలో ఉదయించి, ఉర్రూతలూగించే ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించి, స్వరాష్ట్రం సాధించి, సస్యశ్యామల సన్నివేశాలను సృష్టించి, గమ్యాలను ముద్దాడిన గమనం మనది అని గుర్తు చేశారు కేటీఆర్. ఆటుపోట్లను చూసి అదిరిపడలేదని, ఎదురుదెబ్బలకు బెదిరిపోలేదని, గెలిస్తే పొంగిపోలేదని, ఓటములకు కుంగిపోలేదని పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ ఇదని, ఈ నేల మేలుకోరే భూమి పుత్రుల పార్టీ ఇదని చెప్పారు కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News