అల్లు అర్జున్ అరెస్ట్ తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం
తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని కేటీఆర్ పోస్ట్
డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
జాతీయ అవార్డు పొందిన ఒక నటుడిని అరెస్టు చేసిన తీరు పాలకుల అభద్రతా భావానికి నిదర్శనం. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఘటనలో విఫలమైంది ఎవరు? అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడటం సరికాదు. తొక్కిసలాట ఘటనకు ఆయన నేరుగా బాధ్యుడు కాదు. బన్ని అరెస్టు తీరును ఖండిస్తున్నా. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడని అరెస్టు చేశారు. ఇదే లాజిక్‌తో రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలి. హైడ్రా వల్ల ఇద్దరి మరణానికి రేవంత్ కారణమయ్యారు అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 'అభద్రతాభావం ఉన్న నాయకుడు తన చుట్టూ ఉన్న ప్రజలకు ఎల్లప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు' -రాన్ కార్పెంటర్ అంటూ కొటేషన్‌ను కేటీఆర్ ఈ పోస్టుతో పంచుకున్నారు.