మేడిగడ్డ కాదు 'మేటి'గడ్డ
లక్షకోట్ల రూపాయలు వృధా చేశారనే విమర్శలు లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో గల్లంతయ్యాయన్నారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీ మొక్కవోని దీక్షతో నిలబడిందని, కొండంత బలాన్ని చాటిచెబుతోందని చెప్పారు.
భారీ వర్షాలకు మేడిగడ్డపై వచ్చిన అనుమానాలన్నీ పటాపంచలైపోయాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు మేడిగడ్డపై దుష్ప్రచారం చేశారని, ఈ వర్షాలకు దాని సామర్థ్యం బయటపడిందని.. కాళేశ్వరం కేసీఆర్ ఘనతను మరోసారి తెలంగాణ ప్రజలకు చాటి చెప్పిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ..! అని చెప్పారు. కాళేశ్వరం కరువును పారదోలే “కల్పతరువు”..!! అని అన్నారు.
బురద రాజకీయాలను కాళేశ్వరం భూస్థాపితం చేసిందంటున్నారు కేటీఆర్. ఈ మానవ నిర్మిత అద్భుతాన్ని సృష్టించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి తెలంగాణ సమాజం తరపున మరోసారి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారాయన. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలు కొట్టుకుపోయాయని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని అన్నారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలు పటాపంచలయ్యాయని చెప్పారు. కేసీఆర్ కి సమున్నత సంకల్పం జై కొడుతోందని, జల హారతి పడుతోందని అన్నారు కేటీఆర్.
లక్షకోట్ల రూపాయలు వృధా చేశారనే విమర్శలు లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో గల్లంతయ్యాయన్నారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీ మొక్కవోని దీక్షతో నిలబడిందని, కొండంత బలాన్ని చాటిచెబుతోందని చెప్పారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ నేలకు ఇప్పటికీ ఎప్పటికీ.. మేడిగడ్డ మన కష్టాలు తీర్చే మేటిగడ్డ అని అన్నారు కేటీఆర్.