ఈ మహా నగరానికి ఏమైంది..?
కేటీఆర్ ఈ ట్వీట్ వేసే సమయానికి షాద్ నగర్ లో రియల్టర్ హత్య జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది, ప్రేమ పగతో ఓ యువకుడు మరో యువతి తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశాడు.
వరుస ట్వీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిస్ట్ లపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ వేశారు, ఆ తర్వాత గంటల వ్యవధిలో.. "స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష" అంటూ మరో ఆలోచనాత్మక ట్వీట్ వేశారు. తాజాగా హైదరాబాద్ శాంతి భద్రతల విషయంపై ఘాటుగా స్పందించారు. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని ఆయన ఉదాహరణగా చూపించారు. ఫ్రంట్ పేజీల్లో "ఈ నగరానికి ఏమైంది?" అనే వార్తలొస్తున్నాయంటే.. హైదరాబాద్ లో నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం అని చెప్పారు కేటీఆర్.
పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకు.. అన్నిచోట్లా కనపడుతోందన్నారు కేటీఆర్. "బ్రాండ్ హైదరాబాద్" అనే ఇమేజ్ మసకబారుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఆ కళ కోల్పోతుందని చెప్పారు. సగటు హైదరాబాదీకి ఇదే భావన కలుగుతోందని, హైదరాబాద్ ను ప్రేమించే ప్రతిఒక్కరిలో ఈ ఆవేదన ఉందని అన్నారు కేటీఆర్.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్లుగా నగరం ప్రశాంతంగా ఉందని చెప్పారు కేటీఆర్. ప్రభుత్వం మారాక, వరుస హత్యలు జరుగుతున్నాయని, అంతర్ రాష్ట్ర ముఠాలు పెచ్చుమీరుతున్నాయని, నగర ప్రజల జీవితాలకు భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఆర్భాటంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు కానీ, పోలీసింగ్ పై కమాండ్ లేదని, క్షీణిస్తున్న శాంతిభద్రతలపై కంట్రోల్ లేదని ఎద్దేవా చేశారు.
దేశ రాజధాని చుట్టూ రాజకీయ చక్కర్లు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, చిక్కుల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర రాజధానిపై కూడా దృష్టి పెట్టాలని చురకలంటించారు కేటీఆర్. హైదరాబాద్ ని కేవలం రాజధానిగా చూడొద్దని, ఇది "తెలంగాణ ఎకనమిక్ ఇంజన్" అని గుర్తు చేశారు. హైదరాబాద్ దెబ్బతింటే.. రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నష్టమేనని తేల్చి చెప్పారు కేటీఆర్.
కేటీఆర్ ఈ ట్వీట్ వేసే సమయానికి షాద్ నగర్ లో రియల్టర్ హత్య జరిగింది. ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది, ప్రేమ పగతో ఓ యువకుడు మరో యువతి తల్లిదండ్రుల్ని దారుణంగా హత్య చేశాడు. నేరాలు-ఘోరాలతో తెలంగాణ నెత్తుటిమయంగా మారిపోతుందనే ఆరోపణలు వినపడుతున్నాయి.