లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్ర ఖాయం -కేటీఆర్
కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, గులాబీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు కేటీఆర్.
కరీంనగర్ కదన భేరి సభ గురించి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ వేశారు. కదనభేరి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారాయన. నాడు అయినా.. నేడు అయినా.. ఏనాడైనా.. కరీంనగర్ గడ్డ.. గులాబీ అడ్డ అని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఈ సభకు రాలేకపోయిన కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అయిందని ట్వీట్ చేశారు. కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ గెలుపు ఖాయమని తేలిపోయిందని, గులాబీ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో గుబులు మొదలైందని అన్నారు కేటీఆర్.
కరీంనగర్ కదన భేరి సభను లోక్ సభ ఎన్నికల సమర శంఖారావంగా నిర్వహించింది బీఆర్ఎస్. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టింది. ఊహించినదానికంటే ఎక్కువగానే కదన భేరి సభకు ప్రజలు హాజరయ్యారు. అడుగడుగునా గులాబీ జెండాలు కనిపించాయి. అదే రోజు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నా కూడా కేసీఆర్ ప్రసంగమే సోషల్ మీడియాలో హైలైట్ అయింది. కదనభేరి సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఎన్నికల వ్యూహం..
కదనభేరి సభలో కేసీఆర్ ప్రసంగంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం రెట్టింపైంది. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తన చేతగానితనాన్ని నిరూపించుకుందని గుర్తు చేశారు కేసీఆర్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్దామని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ నుంచే కదం తొక్కుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్వల్ప వ్యవధిలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తిరిగి పుంజుకోవడం బీఆర్ఎస్ కు తప్పనిసరిగా మారింది. ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుందని నిరూపించాలన్నా, 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని రుజువు చేయాలన్నా, తెలంగాణలో బీజేపీ మరింత విజృంభించకుండా చూడాలన్నా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలి. కరీంనగర్ కదనభేరితో ఆ దిశగా తొలి అడుగు వేశారు కేసీఆర్.