బీఆర్ఎస్ పదేళ్ల కష్టం అది..

బీఆర్ఎస్ హయాంలో.. యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2024-03-03 10:46 IST

హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారి, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం అని చెప్పారాయన. గతేడాది జులై 31న కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్రానికి నివేదిక పంపించామని, కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలిపిందని అన్నారు. గతంలో 33 ఎకరాల భూములను కేటాయించడంతోపాటు ఇప్పుడు తాజాగా మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు కేటీఆర్.

బీఆర్ఎస్ సుదీర్ఘ పోరాటం..

రోజు రోజుకీ పెరిగిపోతున్న హైదరాబాద్, పరిసర ప్రాంతాల ట్రాఫిక్ ని నియంత్రించే విషయంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి వ్యూహాత్మక అడుగులు వేసింది. హైదరాబాద్‌-కరీంనగర్‌, హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటం వల్ల రోడ్ల విస్తరణ అప్పట్లో సాధ్యంకాలేదు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతి లేకపోవడంతో నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. ఆ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కీలక ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి సీఎం కేసీఆర్ తోపాటు, కేటీఆర్, ఇతర మంత్రులు, ఎంపీలు కేంద్రంలోని పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేరు. దీంతో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఇది సమష్టి విజయం అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో.. యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు కేటీఆర్. తాజాగా మరో రెండు ఫ్లై ఓవర్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా నిర్మాణాలను అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వీటి వల్ల హైదరాబాద్ నలుదిశలా విస్తరిస్తుందని సూచించారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News