కాంగ్రెస్ హయాంలో మత కల్లోలాలు మొదలు -కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే మత ఘర్షణలు జరుగుతున్నాయని, గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అంటున్నారు కేటీఆర్.
తెలంగాణ ఏర్పడ్డాక తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి మత హింసలు జరగలేదని, కేసీఆర్ హయాంలో శాంతియుత పాలన కొనసాగిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ కట్టుతప్పాయని, ప్రశాంతమైన వాతావరణం దెబ్బతిన్నదని ఆరోపించారు. మెదక్ పట్టణంలో మత కల్లోలాలు జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..?
మెదక్ లో మత ఘర్షణలు జరగడంపై ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ వేసిన ట్వీట్ ని ఈసందర్భంగాప ప్రస్తావించారు కేటీఆర్. మెదక్ పట్టణంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు ముస్లింలను టార్గెట్ చేశారని అందాజుల్లా ఖాన్ ట్విట్టర్ లో కొన్ని వీడియోలను పోస్ట్ చేశారు. ఏడుగురు ముస్లిం యువకులను గాయపరిచినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, కనీసం వారించే ప్రయత్నం చేయలేదని అన్నారు. మతతత్వ శక్తులకు పోలీసులు పూర్తి స్వేచ్ఛనిచ్చారని ఆరోపించారు.
కేవలం మెదక్ లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మత ఘర్షణలు పెరిగాయని గతంలోనే బీఆర్ఎస్ ఆరోపించింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మెదక్ లో అల్లర్లు జరిగాయి. పోలీసులు ఓ వర్గం వారికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. అసలిదంతా రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జరుగుతోందని, గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని అంటున్నారు కేటీఆర్.