కటిక చీకట్ల కాంగ్రెస్ ని తరిమికొడదాం..

కటిక చీకట్ల కాంగ్రెస్ పార్టీ కావాలో, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని రైతులను కోరాలన్నారు కేటీఆర్.

Advertisement
Update:2023-07-15 22:01 IST

ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు మంత్రి కేటీఆర్. దీనికోసం ఆయన కార్యాచరణ సిద్ధం చేశారు. ఈనెల 17నుంచి 10రోజులపాటు ఊరూవాడా ఈ వ్యవహారంపై చర్చ జరగాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పారు. రైతు వేదికల వద్ద 10రోజులపాటు చర్చలు నిర్వహించాలని, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడిన ఆయన కార్యాచరణ వివరించారు.

కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్తు రద్దు చేస్తుందన్న మాటను ప్రజాబాహుళ్యంలోకి మరింతగా తీసుకువెళ్లాలన్నాకు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మూడు పంటలు కావాలా… కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు కావాలా అనే నినాదంతో కదం తొక్కాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతన్నల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకువచ్చేందుకు రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు కేటీఆర్. రైతుల పట్ల వ్యవసాయ రంగం పట్ల గుడ్డి వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీ ఉందని, అందుకే ఉచిత విద్యుత్ పై అనుచితంగా మాట్లాడిందన్నారు.


2001లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడేనని అందుకే రైతు, వ్యవసాయ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఉచిత విద్యుత్ పై అడ్డగోలుగా మాట్లాడారన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగు కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్ అనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని చెప్పారు.

ఈనెల 17నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని, ప్రతి రైతు వేదిక వద్ద కనీసం 1000 మంది రైతులకు తగ్గకుండా ఈ సమావేశాన్ని నిర్వహించాలని, పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగాలని సూచించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సమావేశాల్లో తీర్మానాలు చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కరెంటు కష్టాలను బీఆర్ఎస్ పాలనలో అందుతున్న సౌకర్యాలను వివరించాలన్నారు. కటిక చీకట్ల కాంగ్రెస్ పార్టీ కావాలో, రైతు జీవితాల్లో కరెంటు వెలుగులు నింపిన బీఆర్ఎస్ కావాలో తేల్చుకోవాలని రైతులను కోరాలన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News