చేనేత ఉత్పత్తులపై జీఎస్టీకి వ్యతిరేకంగా ఆన్ లైన్ పిటిషన్లు..
ఇప్పటికే చేనేత రంగం కొవిడ్ దెబ్బకి విలవిల్లాడిపోతోందని, అదనంగా విధించే ఎలాంటి పన్నులైనా వారికి మరింత భారంగా మారతాయని చెప్పారు కేటీఆర్. స్వాతంత్రం తర్వాత భారత దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రభుత్వం ఇదేనని విమర్శించారు.
ఇందుగలదు, అందు లేదని సందేహము వలదు అన్నట్టుగా.. జీఎస్టీని అన్ని వస్తువులు, ఉత్పత్తులపై వేసి చేతివృత్తి దారుల ఉపాధిపై దెబ్బకొట్టారు ప్రధాని నరేంద్రమోదీ. ఆడవారికి అత్యవసరం అయ్యే శానిటరీ ప్యాడ్స్ ముడిపదార్థాలపై కూడా జీఎస్టీ విధించిన కక్కుర్తి కేంద్రానిది. చేనేత కార్మికులు ఉపయోగించే ముడి పదార్థాలు, చేనేత ఉత్పత్తులపై కూడా జీఎస్టీ వాయింపుడు ఉంది. దీన్ని ఎత్తివేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నా పట్టీపట్టనట్టు ఉన్నారు మోదీ. ఇన్నాళ్లూ అభ్యర్థనలతో పని జరుగుతుందేమోనని ఆశించారంతా. కానీ పోరాట పంథా ఎంచుకోకపోతే మోదీ మనసు కరగదని తేలిపోయింది. ఈ పోరాటంలో తొలి అడుగు వేశారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై ఉన్న 5శాతం జీఎస్టీని తొలగించాలంటూ ఇప్పటికే పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని మొదలు పెట్టిన కేటీఆర్, ఇప్పుడు ఆన్ లైన్ పిటిషన్లు కూడా ప్రారంభించారు.
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించి, చేనేత కార్మికుల జీవితాలను కాపాడాలని, భారత సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించాలని కోరుతూ ఆన్ లైన్ లో పిటిషన్లను ప్రారంభించారు కేటీఆర్. ఈ ఉదాత్త ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. www.change.org వెబ్ సైట్ ద్వారా ఈపిటిషన్లు స్వీకరిస్తున్నారు.
చేనేత వృత్తిపై ఆధారపడి దేశంలో 50లక్షలమంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని, వీరిలో అత్యథిక శాతం మహిళలు ఉన్నారని తన పిటిషన్లో చెప్పారు కేటీఆర్. వీరి జీవనోపాధి దెబ్బతినకుండా ఉండాలంటే, చేనేత ఉత్పత్తులపై విధించిన జీఎస్టీని పూర్తిగా తొలగించాలన్నారు. అసంఘటిత రంగాల్లో చేనేత రంగం అతి పెద్దదని, గ్రామీణ జీవనోపాధిలో అది అంతర్భాగమని చెప్పారు. ఇప్పటికే చేనేత రంగం కొవిడ్ దెబ్బకి విలవిల్లాడిపోతోందని, అదనంగా విధించే ఎలాంటి పన్నులైనా వారికి మరింత భారంగా మారతాయని చెప్పారు. స్వాతంత్రం తర్వాత భారత దేశంలో చేనేత వస్త్రాలపై పన్ను విధించిన తొలి ప్రభుత్వం ఇదేనని విమర్శించారు.
కేటీఆర్ సోదరి కవిత కూడా ఈ ఆన్ లైన్ పిటిషన్లో భాగస్వామి అయ్యారు. పోస్ట్ కార్డ్ ఉద్యమంలో తాను భాగస్వామి అవుతున్నానని, ఆన్ లైన్ లో కూడా పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. రోల్ బ్యాక్ హ్యాండ్ లూమ్ జీఎస్టీ పేరుతో హ్యాష్ ట్యాగ్ జతచేసి ఈ ఆన్ లైన్ పిటిషన్ ని వైరల్ చేస్తున్నారు. ఈ పిటిషన్ దేశ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. మరి దీన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందా, నేతన్నలపై భారం తగ్గిస్తుందా అనేది వేచి చూడాలి.