పాలమ్మిన, పూలమ్మిన.. కేటీఆర్ సభలో నవ్వులే నవ్వులు

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ జవహర్ నగర్ లో ప్రారంభించారు. రూ. 550 కోట్లతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని, రూ. 250 కోట్లతో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ను ఆయన ప్రారంభించారు.

Advertisement
Update:2023-04-16 13:23 IST

మంత్రి మల్లారెడ్డి సభలంటే ఈమధ్య కాలంలో ఎక్కడలేని సరదా వచ్చేస్తుంది. సభకు హాజరైన వారంతా కడుపుబ్బా నవ్వుకునే అక్కడినుంచి వెళ్తుంటారు. ఈ సరదాకి తోడు మంత్రి కేటీఆర్ కూడా జతకలిశారు. ఇంకేముంది సభలో నవ్వులే నవ్వులు. మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్ పాలమ్మిన, పూలమ్మిన.. అంటూ కేటీఆర్ సభలో మాట్లాడే సరికి అందరూ కడుపుబ్బా నవ్వారు. మల్లారెడ్డి కష్టపడే తత్వాన్ని మరోసారి గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. ఆయనకు అందరూ మద్దతివ్వాలని చెప్పారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ జవహర్ నగర్ లో ప్రారంభించారు. రూ. 550 కోట్లతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని, రూ. 250 కోట్లతో మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్‌ ను ఆయన ప్రారంభించారు. 3,169 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. మేడ్చల్‌ – మల్కాజ్ గిరి జిల్లా జవహర్‌ నగర్‌ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్ పాల్గొన్నారు. జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్గంధానికి శాశ్వతంగా చెక్‌ పెట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్. తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తున్నామని, పొడి చెత్త నుంచి ఇప్పటికే 20 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. మరో 28 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా రూ. 550 కోట్లతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులు జరుగుతున్నాయని చెప్పారు. చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే కేంద్రం దక్షిణ భారతదేశంలో ఒక్క జవహర్‌ నగర్‌ లోనే ఉందని చెప్పారు.

గత పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ సమస్య వారసత్వంగా తమ ప్రభుత్వానికి వచ్చినట్లయిందన్నారు మంత్రి కేటీఆర్. అయినప్పటికి చిత్తశుద్ధితో జవహర్‌ నగర్‌ ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కేటీఆర్. జవహర్‌ నగర్‌ లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసిన సమయంలో హైదరాబాద్‌ నుంచి ప్రతి నిత్యం మూడు వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వచ్చేవని, అదిప్పుడు మూడింతలు పెరిగి 8 వేల మెట్రిక్‌ టన్నులకు చేరిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఒక్కొక్కటిగా అధ్యయనం చేస్తూ శాశ్వతంగా సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News