రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారుతుందేమో..?
తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని చెప్పారు కేటీఆర్. ఆ పేరుని గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు
కేంద్రం తీసుకొచ్చిన కొత్త న్యాయ చట్టాలకు తెలంగాణ రాష్ట్రం సవరణలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త చట్టాలను యథాతథంగా అమలు చేస్తే రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారుతుందేమోననే అనుమానాలున్నాయని చెప్పారాయన. అసెంబ్లీ చివరిరోజు సమావేశాల సందర్భంగా న్యాయ చట్టాలతోపాటు పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రం తెచ్చిన చట్టాలకు తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్.. కొన్ని మార్పులు చేసి అమలు చేస్తున్నాయని, తెలంగాణ కూడా సవరణలు తీసుకు రావాలని చెప్పారు కేటీఆర్.
సివిల్ కోర్టుల సవరణ బిల్లుని సమర్థిస్తూ, స్వాగతిస్తున్నామని తెలిపారు కేటీఆర్. రాజకీయంగా విబేధాలున్నా న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమష్ఠిగా పని చేద్దామన్నారు. అత్యాచారాలు, సైబర్ క్రైమ్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. అవసరమైతే ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలన్నారు కేటీఆర్.
ఇక తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని చెప్పారు కేటీఆర్. ఆ పేరుని గత ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయించారని గుర్తు చేశారు. పదేళ్ల పాట విభజన జరగలేదు కాబట్టి ఆ పేరు పెట్టలేకపోయామని, ఇప్పుడు విభజన జరిగిపోయింది కాబట్టి.. తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని కోరారు. మహానుభావులను రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఒరవడిని కొనసాగించాలని సూచించారు కేటీఆర్.