కేసీఆర్ పై పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే
కేసీఆర్ ప్రత్యర్థి అంటే.. వారిని మీడియా హైలైట్ చేస్తుందని, ఆ విధంగా వారికి పేరు రావాలే కానీ, డిపాజిట్లు మాత్రం రావని చెప్పారు కేటీఆర్.
సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తే పేరొస్తుందేమో కానీ, ప్రత్యర్థులకు డిపాజిట్ రాదని అన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని తెలియగానే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయని అన్నారు. కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టేనని చెప్పారు. కామారెడ్డిలో కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలన్నారు. ఇక్కడ కేసీఆర్ గెలుపు ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం, ధృడమైన సంకల్పం ఉంటుందని అన్నారు మంత్రి కేటీఆర్. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీపై దేశమంతా ఆసక్తి చూపుతోందన్నారు. ఇక్కడి ప్రజలు గుండెల నిండుగా కేసీఆర్ ని ఆశీర్వదించాలని కోరారు. కామారెడ్డిలో 8 మండలాల్లో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని గుర్తు చేశారాయన. జలసాధన ఉద్యమానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలోనే శ్రీకారం చుట్టారని తెలిపారు కేటీఆర్. తెలంగాణ ఉద్యమానికి నిధుల సేకరణ కూడా కామారెడ్డిలోనే ప్రారంభమైందని చెప్పారు.
దక్షణ భారతదేశంలోనే హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పై పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు వెనక్కు తగ్గాయని అన్నారు. కేసీఆర్ ప్రత్యర్థి అంటే.. వారిని మీడియా హైలైట్ చేస్తుందని, ఆ విధంగా వారికి పేరు రావాలే కానీ, డిపాజిట్లు మాత్రం రావని చెప్పారు. కులాలు, మతాలకతీతంగా కేసీఆర్ కి ప్రజలంతా మద్దతు తెలపాలని, రికార్డు మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్.