కేటీఆర్‌ సార్.. మా ఏరియాలో మెట్రో రైలు విస్తరించండి.. గ్రేటర్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

హైదరాబాద్ మెట్రో రైలు సౌకర్యాన్ని తమ ప్రాంతాలకు విస్తరించాలని కోరుతూ రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ఎమ్మెల్యేలు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Advertisement
Update:2023-06-03 16:48 IST

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే టీఎస్ఆర్టీసీని బలోపేతం చేస్తోంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నది. ఇక మెట్రో తొలి దశ విజయవంతం కావడంతో.. ఇప్పుడు సొంత ఖర్చుతో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు ఎక్స్‌ప్రెస్ మెట్రోను నిర్మిస్తోంది. మరో మూడు నాలుగేళ్లలో ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా మెట్రో సేవల కోసం డిమాండ్ పెరుగుతున్నది.

హైదరాబాద్ మెట్రో రైలు సౌకర్యాన్ని తమ ప్రాంతాలకు విస్తరించాలని కోరుతూ రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ఎమ్మెల్యేలు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్ సిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదిగూడ, మియాపూర్-పటాన్‌చెరు రూట్లో మెట్రో ప్రాజెక్టును విస్తరించాలని కోరుతున్నారు.

ఎల్బీనగర్-మియాపూర్ కారిడార్‌ను రామోజీ ఫిల్మ్ సిటీ వరకు పొడిగిస్తామని గతంలోనే మంత్రి కేటీఆర్ చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీకి మెట్రోను పొడిగించడం వల్ల టూరిజం పెరుగుతుందని ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. కేటీఆర్‌కు తెలిపారు. ఈ మేరకు డీపీఆర్ సిద్ధం చేసేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల కొంగరకలాన్ ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా అక్కడే నిర్మించారు. ఫాక్స్‌కాన్ సంస్థ భారీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నది. ఫార్మా కంపెనీలు కూడా ఆ ప్రాంతంలోకి వస్తున్నాయి. అటువైపు మెట్రోను విస్తరిస్తే లాభదాయకంగా కూడా ఉంటుందని కేటీఆర్‌కు చెప్పారు. దీంతో పాటు హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ రంగం కూడా విస్తరిస్తోంది. పోచారం, ఫీర్జాదిగూడ వైపు మెట్రోను పొడిగిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. కాగా, త్వరలోనే ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News