ఇది నల్గొండ ఐటీ హబ్.. ఫొటోలు షేర్ చేసిన మంత్రి కేటీఆర్

నల్గొండలో రూ.98కోట్లతో ఐటీ హబ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 13 కంపెనీలు ఈ ఐటీ హబ్ లో తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. తొలి దశలో ఆ కంపెనీలు 350మందిని ఎంపిక చేసుకున్నాయి.

Advertisement
Update:2023-09-03 08:29 IST

తెలంగాణలో ఐటీ అంటే ఇకపై హైదరాబాద్ ఒక్కటే కాదు. టైర్ -2 సిటీస్ లో కూడా ఐటీ రంగాన్ని విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోంది. ఆ దిశలో ఇప్పటికే విజయం సాధించింది. హైదరాబాద్ తోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ హబ్ లు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, సిద్దిపేట, నిజామాబాద్‌ లో ఐటీ హబ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. వివిధ కంపెనీలు ఐటీ హబ్ లలో తమ ఆఫీస్ లు ఏర్పాటు చేస్తున్నాయి. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అక్కడే ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఇలాంటి అవకాశం త్వరలో నల్గొండ యువతకు కూడా లభించబోతోంది.

నల్గొండ ఐటీ హబ్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆ ఫొటోలను మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరికొన్ని వారాల్లోనే ఈ ఐటీహబ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగం విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కేటీఆర్.


నల్గొండ ఐటీహబ్ ప్రత్యేకతలు..

నల్గొండలో రూ.98కోట్లతో ఐటీ హబ్ నిర్మిస్తున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌(టాస్క్‌) ఆధ్వర్యంలో ఇటీవలే జాబ్‌ మేళా కూడా నిర్వహించారు. దాదాపు 15,316 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. ఇప్పటికే 13 కంపెనీలు ఈ ఐటీ హబ్ లో తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. తొలి దశలో ఆ కంపెనీలు 350మందిని ఎంపిక చేసుకున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా ఇక్కడ తమ ఆఫీస్ లు ప్రారంభించేందుకు ఆసక్తి చూపించాయి. ఐటీ హబ్ ప్రారంభం అయిన రోజునుంచే ఇక్కడ ఆయా కంపెనీల కార్యకలాపాలు మొదలవుతాయి.

Tags:    
Advertisement

Similar News