తెలంగాణ వాళ్లు దొరకలేదా.. సింఘ్వీ ఎంపికపై కేటీఆర్

కాంగ్రెస్ సింఘ్వీని అభ్యర్థిగా ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత పదేళ్లలో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

Advertisement
Update:2024-08-15 08:39 IST

కే.కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి రాజస్థాన్‌కు చెందిన అభిషేక్‌ మను సింఘ్వీ ఎంపికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి సమర్థుడైన ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్‌ పార్టీకి దొరకలేదా అని త‌న ట్వీట్‌లో ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో చాలా మంది అర్హులైన నేతలున్నప్పటికీ.. చివరికి ఢిల్లీ బాసుల వీటో అధికారమే చెల్లిందంటూ సెటైర్ వేశారు కేటీఆర్. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు తోలు బొమ్మల్లా హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నారన్నారు కేటీఆర్.


బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. ఇందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో కాంగ్రెస్ సింఘ్వీని అభ్యర్థిగా ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత పదేళ్లలో ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

సింఘ్వీ ఎంపికపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన వ్యక్తినే అభ్యర్థిగా ఎంపిక చేయాలని రాష్ట్ర నేతలు చెప్పినప్పటికీ.. హైకమాండ్ పట్టించుకోలేదని సమాచారం. మరోవైపు రాజస్థాన్‌కు చెందిన సింఘ్వీకి తెలంగాణ ప్రయోజనాలు ఏం అర్థమవుతాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News