నీతి ఆయోగ్ మీటింగ్‌కు దూరం.. రేవంత్‌కు కేటీఆర్ చురకలు
చోటే భాయ్ నీతిఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం ప్రధానమంత్రితో మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని రేవంత్‌ను ప్రశ్నించారు కేటీఆర్.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంతో నిరసనగా ఈనెల 27న ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే అంశంపై స్పందిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. గతంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని న్యాయమైన డిమాండ్ల కోసం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేసిందని, బీజేపీతో కుమక్కయ్యారని ఆరోపించిందని గుర్తుచేశారు కేసీఆర్.
ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ బహిష్కరించడాన్ని కాంగ్రెస్ ఎలా సమర్థించుకుంటుందన్నారు కేటీఆర్. దీనికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. చోటే భాయ్ నీతిఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి సంబంధించిన నిధుల కోసం ప్రధానమంత్రితో మాట్లాడాలని ఎందుకు అనుకోవడం లేదని రేవంత్‌ను ప్రశ్నించారు కేటీఆర్.
గతంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై ప్రధాని మోడీని నిలదీయాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ప్రధానిని నిలదీసేందుకు నీతిఆయోగ్ సమావేశం సరైన వేదిక అంటూ చెప్పారు. కాగా, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పు పడుతున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని మోడీని రేవంత్ నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.