కుర్ కురే బీజేపీ.. కిరికిరి కాంగ్రెస్

ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని, అది ఇవ్వలేకపోతే ఆయనకు లగ్గం చేస్తారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

Advertisement
Update:2024-05-08 10:07 IST

తెలంగాణకోసం పేగులు తెగేదాకా కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు కేటీఆర్. అంబర్ పేట రోడ్ షో లో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలను కోరారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. 10 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కి ఇస్తే, కేసీఆర్ ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని చెప్పారు కేటీఆర్.


కుర్ కురే.. కిరికిరి

కరోనా టైమ్ లో కుర్ కురేలు పంచిన బీజేపీ ఓవైపు, అంతర్గత పోరుతో సతమతం అయ్యే కిరికిరి కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని.. లోక్‌సభ ఎన్నికల్లో కుర్‌కురే పార్టీకి, కిరికిరి పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు కేటీఆర్. జూన్ 2 తర్వాత బీజేపీ వాళ్లు కచ్చితంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని, అలా జరగకూడదంటే.. బీఆర్ఎస్ కి పార్లమెంట్ లో బలం ఉండాలన్నారు. ఇవి ప్రధాని పదవికోసం జరిగే ఎన్నికలు కదా, దీంట్లో బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఏముందని ఎవరూ అనుకోవద్దని.. గతంలో ఐదుగురు ఎంపీలు ఉండటం వల్లే కేసీఆర్ తెలంగాణను తెచ్చారని వివరించారు కేటీఆర్. ఢిల్లీ మెడలు, కాంగ్రెస్ మెడలు వంచేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఐదేళ్లలో కిషన్ రెడ్డి అంబర్‌పేటకు ఒక్క రూపాయి కూడా తేలేదని, కనీసం ఒక గుడి లేదా బడి కూడా కట్టలేదని.. ఆయనకు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు కేటీఆర్. బీజపీ వాళ్లే కిషన్ రెడ్డి హటావో.. సికింద్రాబాద్ బచావో అంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ 400 సీట్లు అడుగుతోందని, అదే జరిగితే.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు... రూ.400కి చేరతాయన్నారు. సిలిండర్ ధరను 5వేల రూపాయలకు పెంచేస్తారని చెప్పారు.

బీజేపీతో తమకు దోస్తీ ఉందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, "అదే నిజమైతే.. మా చెల్లెలు కవిత జైలులో ఉండేదా"? అని ప్రశ్నించారు కేటీఆర్. 2014 లో బడేభాయ్.. 2023 లో చోటే భాయ్ మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తే జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నమ్మి మోసపోయారని చెప్పారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేశామంటూ సీఎం రేవంత్ రెడ్డి హోర్డింగ్ లు పెట్టుకుని ప్రజల్ని వంచిస్తున్నారని అన్నారు. ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని, అది ఇవ్వలేకపోతే ఆయనకు లగ్గం చేస్తారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News