రేవంత్ రెడ్డి - గోల్డ్ మెడల్.. ట్విట్టర్లో కేటీఆర్ సెటైర్
ఆ ఘటన తనకు ఓ మెడల్ లాంటిదన్నారు రేవంత్ రెడ్డి. ఈ "మెడల్" వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని అన్నారు.
"స్కాంగ్రెస్ అండ్ ఇట్స్ గోల్డ్ మెడల్ విన్నర్స్.." అంటూ ట్విట్టర్లో సెటైర్లు పేల్చారు మంత్రి కేటీఆర్. పాపం కాంగ్రెస్ పరిస్థితి ఎంత దిగజారిపోయింది అంటూ సానుభూతి చూపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకెళ్లిన రేవంత్ రెడ్డి దాన్ని తనకు వచ్చిన మెడల్ గా అభివర్ణిస్తున్నారని, ఆయన కంటే మంచివాళ్లెవరూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దొరకలేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన ఓ వీడియోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి ఏమన్నారు..?
ఇండియా టుడే ఛానెల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి తనపై ఉన్న కేసుల గురించి స్పందించారు. ఓటుకు నోటు వ్యవహారంలో అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన సందర్భంలో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారని, కోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ ఇచ్చిందనే విషయాన్ని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ ప్రస్తావించారు. ఇది మీ ట్రాక్ రికార్డ్ లో ఓ మచ్చ కదా అని ప్రశ్నించారు. అయితే రేవంత్ రెడ్డి దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. ఆ ఘటన తనకు ఓ మెడల్ లాంటిదన్నారు. ఈ "మెడల్" వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని అన్నారు.
కాంగ్రెస్ గత పాలనను విమర్శించడంతోపాటు, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కూడా బీఆర్ఎస్ నేతలు పూర్తిగా కార్నర్ చేస్తున్నారు. సోనియాను రేవంత్ రెడ్డి గతంలో బలిదేవత అనడం, కాంగ్రెస్ పాలనను తప్పుబట్టడం వంటి ఉదాహరణలను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అన్న రేవంత్ రెడ్డి మాటలు కూడా బీఆర్ఎస్ ప్రచార అస్త్రాలుగా మారాయి. ఓటుకు నోటు వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించడంతోపాటు, తాజాగా నోటుకు సీటు అనే అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి "మెడల్" వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ వేశారు.
♦