రాజకీయ నాయకులు - చదువులు.. కేటీఆర్ అదిరిపోయే పంచ్
రాజకీయ నాయకుల్లో సగం మందివి ఫేక్ సర్టిఫికెట్లేనని అన్నారు మంత్రి కేటీఆర్. నరేంద్ర మోదీ సర్టిఫికెట్ల మీద కూడా డౌట్లున్నాయని చెప్పారు. మోదీ సర్టిఫికెట్ చూస్తే మాస్టర్స్ ఇన్ ఎంటైర్ పొలిటికల్ సైన్సెస్ అని ఉంటుందని, అదేం దిక్కుమాలిన సబ్జెక్ట్.. అని సెటైర్ పేల్చారు.
రాజకీయ నాయకులు, వారి చదువులపై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారు. తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యలపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు కౌంటర్ గా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. అమెరికాలో తాను ఉద్యోగం చేసినప్పటి పరిస్థితి వివరించారు. ఒక్క పరీక్ష రాయకుండా, ఒక్క ఉద్యోగం చేయకుండా.. నేరుగా రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడేవారికి నిరుద్యోగుల సమస్యలు ఎలా అర్థం అవుతాయని, వారి గురించి మాట్లాడే హక్కు కూడా ఆ నాయకులకు లేదన్నారు కేటీఆర్.
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నిర్వహించిన ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ లో తాను క్వాలిఫై అయ్యాక పుణెలో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశానని చెప్పారు కేటీఆర్. జీ మ్యాట్, టోఫెల్ రాసి అమెరికా వెళ్లి ఇంటర్వ్యూలకు హాజరయ్యానని, ఉద్యోగం కూడా చేశానన్నారు. భారత్ కి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగం చేసి, రాజకీయాల్లోకి వచ్చానన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యారా అని ప్రశ్నించారు. వారి మొహానికి ఎవరైనా ఉద్యోగం ఇచ్చారా అన్నారు. ఏమీ చేయని వెధవలు వచ్చి, ఇప్పుడు తమ గురించి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.
సగం మందివి ఫేక్ సర్టిఫికెట్లే..
రాజకీయ నాయకుల్లో సగం మందివి ఫేక్ సర్టిఫికెట్లేనని అన్నారు మంత్రి కేటీఆర్. నరేంద్ర మోదీ సర్టిఫికెట్ల మీద కూడా డౌట్లున్నాయని చెప్పారు. మోదీ సర్టిఫికెట్ చూస్తే మాస్టర్స్ ఇన్ ఎంటైర్ పొలిటికల్ సైన్సెస్ అని ఉంటుందని, అదేం దిక్కుమాలిన సబ్జెక్ట్.. అని సెటైర్ పేల్చారు. ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ సర్టిఫికెట్ల మీద కూడా డౌట్లున్నాయని అన్నారు. రాజకీయ నాయకులు, వారి చదువులు, ఉద్యోగాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.