రూపాయి 80కి చేరింది.. అభివృద్ది కొనసాగుతోంది... కేటీఆర్ సెటైర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు సహాయ, సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా తనదైన శైలితో సీరియస్, సెటైర్ ట్వీట్లు పేలుస్తూ ఉంటారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒకవైపు అభివృద్ది కార్యక్రమాలు, ప్రజలకు సహాయ, సంక్షేమ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా తనదైన శైలితో సీరియస్, సెటైర్ ట్వీట్లు పేలుస్తూ ఉంటారు. తన రోజూవారీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ దేశ, రాష్ట్ర రాజకీయాలపై తనవైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులు చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ ఉంటారు.
ఎన్నడు లేనంతగా రూపాయి విలువ దిగజారిపోయి డాలర్ కు 80 రూపాయలు అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వంపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మాట్లాడిన మాటల వీడియోలను బైటికి తీసి పోస్టు చేస్తున్నారు.
రణ్ విజయ్ సింగ్ అనే నెటిజన్ ఈ అంశంపై చేసిన పోస్టును కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ''మన్మోహన్ సింగ్ రూపాయిని 58 వద్ద వదిలేసారు, దాన్ని 80 రూపాయలకు చేర్చడానికి నరేంద్ర మోడీ అవిశ్రాంతంగా కృషి చేశారు.
మోదీ హయాంలో 8 ఏళ్లలో 22 పాయింట్లు పెరిగాయి. మన్మోహన్ సింగ్ మొత్తం 10 ఏళ్ల పాలనలో కూడా కేవలం 13 పాయింట్లు మాత్రమే పెంచగలిగారు....అభివృద్ధి కొనసాగుతుంది...'' అని ట్వీట్ లో కామెంట్ చేశారు.
కేటీఆర్ రీ ట్వీట్ చేసిన ఈ ట్వీట్ ను ఇప్పటికే 1700 మందికి పైగా రీ ట్వీట్లు చేశారు.
మరో వైపు మన్ మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న రోజుల్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 58 రూపాయలకు చేరుకున్నప్పుడు మోదీ చేసిన ఉపన్యాసం వీడియోను కూడా నెటిజనులు పోస్ట్ చేస్తున్నారు. కొద్ది రోజుల్లో రూపాయిని మైక్రో స్కోప్ తో చూడాల్సి వస్తుందేమో అని మోదీ వ్యంగ్యంగా అన్న మాటలను నెటిజనులు కోట్ చేస్తున్నారు. ఇప్పుడిక రూపాయిని చూడటానికి మైక్రో స్కోప్ కూడా సరిపోదు అని కామెంట్ చేస్తున్నారు.