ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కుంగిపోవాల్సిన అవసరం లేదు..
పదేళ్లుగా ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడిపామో.. అదే పద్ధతుల్లో ఈ కొత్త పాత్ర కూడా నిర్వర్తిస్తామన్నారు కేటీఆర్. ప్రతిపక్ష పాత్రలో కూడా అలవోకగా ఇమిడిపోతామన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఎదురైందని, దీంతో కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ఒక ఎదురు దెబ్బ మాత్రమేనని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దాం, సమీక్షలు చేసుకుని, మార్పులు చేర్పులు చేసుకుందాం అని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్ మహా నగరం, మెదక్ జిల్లా అండగా నిలబడ్డాయని, కొన్ని చోట్ల స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని చెప్పారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
119లో 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు ఆదేశించారని, సమర్థవంతంగా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు కేటీఆర్. గత 100 రోజులుగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి శ్రమించి అభ్యర్థుల గెలుపు కోసం చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 60 లక్షల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడి శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని, గతం కంటే మంచి మెజార్టీ సాధిస్తామనే ఆశాభావంతో ఎన్నికలకు వెళ్లామని, కానీ అనుకున్న ఫలితం రాలేదని అన్నారు. కారణాలను సమీక్షించుకుంటామని వివరించారు.
పదేళ్లుగా ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా నడిపామో.. అదే పద్ధతుల్లో ఈ కొత్త పాత్ర కూడా నిర్వర్తిస్తామన్నారు కేటీఆర్. ప్రతిపక్ష పాత్రలో కూడా అలవోకగా ఇమిడిపోతామన్నారు. ఈ 23ఏళ్లలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయని, ఎన్నో సందర్భాల్లో ఎత్తు పల్లాలు చూశామని, అనుకున్న లక్ష్యం తెలంగాణ సాధించామని, ప్రజల దయతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టామని, చేసిన అభివృద్ధి పట్ల సంతృప్తి ఉందని చెప్పారు కేటీఆర్. నాయకులు, కార్యకర్తల కృషి, పోరాట ఫలితంగానే బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయన్నారు. విజయం సాధించిన కాంగ్రెస్ కి అభినందనలు తెలిపారు కేటీఆర్.
♦