మా అయ్య పేరు కేసీఆర్.. బరాబర్ నేను ఉద్యమంలోనుంచి వచ్చినా
"మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ నేను ఉద్యమంలోనుంచి వచ్చినా.." అంటూ రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తండ్రి పేరు చెప్పుకుని వస్తే తనను సిరిసిల్లలో ఐదుసార్లు ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
మోసగాళ్లలో నిజాయితీగల మోసగాడు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పొంకనాల పోతిరెడ్డిలాగా ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్-9న రైతులకు రుణమాఫీ చేస్తానని మాటిచ్చిన ఆయన జనవరి9 పోయినా, మార్చి9 పోయినా ఇంకా ఎందుకు తన మాట నిలబెట్టుకోలేదని నిలదీశారు. 100 రోజులు నిండిన వెంటనే కాంగ్రెస్ కి బొందపెట్టడం గ్యారెంటీ అన్నారు కేటీఆర్. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆగాడని, అలాగే తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు అవకాశమిచ్చారని, ఆ తర్వాత ఊరుకునేదే లేదని చెప్పారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పేగులు తెంపి మెడలో వేసుకుంటానని మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. లాగులో తొండలు విడిచిపెడతా, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతా అని చెప్పే సీఎం ఎవరూ ఉండరన్నారు. మొగోడివైతే తనపై గెలువు అంటూ సవాల్ విసురుతున్న రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. గెలిస్తే మొగోడు, ఓడితే కాదా అని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయారని, రాహుల్ గాంధీ కూడా ఓడిపోయారని.. మరి అప్పుడు వారిని ఏమనాలన్నారు.
మా అయ్యపేరు కేసీఆర్..
అయ్యపేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదంటున్న రేవంత్ రెడ్డి.. ఆయన చుట్టూ ఉన్న వారి గురించి ఒక్కసారి ఆలోచించాలన్నారు కేటీఆర్. శ్రీధర్ బాబు, సహా ఆయన చుట్టుపక్కల ఉన్న నాయకుల్లో చాలామంది తండ్రుల పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చినవాళ్లే కదా అన్నారు. రాహుల్ గాంధీ.. అయ్య, అవ్వపేరు చెప్పుకుని రాజకీయాలు చేయట్లేదా అని సూటిగా ప్రశ్నించారు. "మా అయ్య పేరు కేసీఆర్, బరాబర్ నేను ఉద్యమంలోనుంచి వచ్చినా.." అంటూ రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తండ్రి పేరు చెప్పుకుని వస్తే తనను సిరిసిల్లలో ఐదుసార్లు ప్రజలు ఎందుకు గెలిపిస్తారన్నారు. తాను రేవంత్‌రెడ్డిలాగా రాంగ్ రూట్ లో, ఆంధ్రోళ్ల బూట్లు నాకి, సంచులు మోసి, పార్టీ మారి పదవులు పొందలేదన్నారు. కారు కూతలు, చిల్లర మాటలు మానుకోవాలని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు కేటీఆర్.
మేడిగడ్డలో 85 పిల్లర్లు ఉంటే.. అందులో మూడు కుంగిన మాట వాస్తవం అని, అయితే కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. కాళేశ్వరంలో 100 భాగాలుంటే అందులో ఒకటి మేడిగడ్డ అని వివరించారు. మూడు నెలలో ఆ మూడు పిల్లర్లు బాగుచేసే తీరిక ఈ ముఖ్యమంత్రికి దొరకలేదా అని ప్రశ్నించారు కేటీఆర్.