''విడిపోతే చెడిపోతాం'' అన్నది ప్రతి ఒక్కరూ గుర్తించాలి
కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా మహాసంకల్ప దీక్ష చేద్దాం : కేటీఆర్
విడిపోతే చెడిపోతాం అన్న నినాదం మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా పాపులర్ అయ్యిందని.. మనం కూడా ఎన్నికల్లో విడిపోతే అన్యాయమవుతామని.. అందుకే అందరం కలిసి కట్టుగా పని చేద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే మహాసంకల్పంతో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా మహా సంకల్ప దీక్ష చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు మేలు జరగాలంటే మళ్లీ కేసీఆర్ రావాలన్నారు. తెలంగాణ గడ్డపై గులాబీ జెండాకు ఉన్నంత ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదన్నారు. కేసీఆర్ మాత్రమే ఇక్కడి మట్టి మనిషి అవుతాడన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎప్పటికైనా ఢిల్లీ మనుషులేనని అన్నారు. కేసీఆర్ పోరాటంతో పాటు తెలంగాణ కోసం విద్యార్థులు, యువత బలిదానాలను దీక్షా దివస్ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటైనా జూన్ 2 ఎంత ముఖ్యమో.. నవంబర్ 29న కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజూ అంతే ముఖ్యమన్నారు. కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న విజయ్ దివస్ గా జరుపుకుందామన్నారు.
అంబేద్కర్ వల్లనే తెలంగాణ
బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగంలోకి ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరం ఆయనను గుర్తు చేసుకుందామని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ చూపిన బాటలోనే బోధించు.. సమీకరించు.. పోరాడు విధానంలోనే కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. పదవి త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి.. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నదిగా చేసే ప్రయత్నాలు చేసినా ప్రజలు ఎప్పటికీ ఆయనను మరిచిపోరని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు అరచేతిలో స్వర్గం చూపించారని.. వాటిని నమ్మి మోసపోయామని ప్రజలే చెప్తున్నారని అన్నారు. మళ్లీ రైతులు, నేత కార్మికులు, విద్యార్థుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ఆరు గ్యారంటీలు, వందలాది హామీలిచ్చి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ, గ్యారంటీని నెరవేర్చలేదన్నారు.
నన్ను అరెస్ట్ చేయాలని రేవంత్ చూస్తున్నడు
తనను ఎందులోనైనా ఇరికించి అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని.. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల అండ ఉన్నంత వరకు తాను ఎవడి అయ్యకూ భయపడబోనని అన్నారు. సిరిసిల్ల కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాడని.. బీఆర్‌ఎస్ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడని.. అలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకువచ్చారని మండిపడ్డారు. పార్టీ నాయకులెవరూ భయపడొద్దని.. వాళ్లు వెంట్రుక కూడా పీకలేరని అన్నారు. రేవంత్ రెడ్డి సహా ఏ ఒక్కరూ ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అండ చూసుకొని అతి చేస్తున్న అధికారులకు బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఆ బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని.. కానీ నాలుగేళ్లు వేచి చూడాల్సిందేనన్నారు. సీఎం వేములవాడలో నాలుగు మంచి మాటలన్నా చెప్తాడని అనుకున్నానని.. అది ఏ సభ అయినా కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నాడని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు.. హామీలకు తూట్లు.. కేసీఆర్‌కు తిట్లు తప్ప నువ్వేం పీకినవ్ అని ప్రశ్నించారు. జనాలు నిన్ను ఛీ కొట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
నేరెళ్ల బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించిన
కొడంగల్ లో రైతుల దగ్గరికి వెళ్లలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నారని అన్నారు. నేరెళ్లలోనూ ఒక సంఘటన జరిగిందని, కానీ తాను బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానని, వాళ్ల దగ్గరికి వెళ్లి కలిసి వీలైనంత సాయం చేశానని అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూసినా నేరెళ్ల ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తనకే ఎక్కువ ఓట్లు వేశారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో పాలకులు అంటే ప్రజలతో తిట్లు తిన్నా సరే వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలన్నారు. కొడంగల్ రైతులు తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా రేవంత్ రెడ్డి వారి గోడు పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి సోదరుడిని, మంత్రులను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నా పట్టించుకోకపోవడంతోనే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారని అన్నారు. ''అదే రేవంత్ రెడ్డి అక్కడికి పోయి ఉంటే ఉరికించి.. ఉరికించి కొట్టేవాళ్లు. ఈ ముఖ్యమంత్రి కేవలం అదానీ, తన అన్న, అల్లుడు, బావమరిదికి అమృతం పంచేందుకు మాత్రమే పని చేస్తుండు. ప్రజల కోసం ఏమీ చేయలేదు. 28 సార్లు ఢిల్లీకి పోయిండు.. ఫ్లైట్ ఛార్జీలు వృథా తప్ప 28 రూపాయలు కూడా తీసుకురాలే.. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వాళ్లు కూడా 8 రూపాయల నిధులు తేలేదు. ప్రజలందరూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న పనులను గమనిస్తున్నారు..'' అన్నారు.
ప్రభుత్వం దిగిపోయే ఉపాయం ఉన్నదా అని ఆటోడ్రైవర్ అడిగిండు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే ఉపాయం ఏమన్నా ఉన్నదా అని ఇటీవల తనను హైదరాబాద్ లో ఒక ఆటోడ్రైవర్ అడిగాడని గుర్తు చేశారు. ఒకసారి ఓటు వేస్తే ఐదేళ్లు శిక్ష అనుభవించాల్నా అని ఆయన అన్నాడని తెలిపారు. ఓటేసిన పాపానికి మరో నాలుగేళ్లు వీళ్లు పీక్క తింటూనే ఉంటారని అన్నారు. సిరిసిల్లలో ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉంటే ఈ సీఎం వేములవాడలో నూలు డిపో పెట్టాడని, అది ఆయనకున్న అవగాహన, పరిజ్ఞానం అని ఎద్దేవా చేశారు. గుండుకు దెబ్బ తాకితే మోకాలి మందు పెట్టినట్టుగా పరిస్థితి ఉందని, ఇంత తెలివైన వాళ్లు ఉండటం మన అదృష్టమని విచారం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో ఈ ముఖ్యమంత్రిని తిట్టినట్టు తిట్లు ఇంకెవరిని తిట్టగా తాను చూడలేదన్నారు. ''ఆ తిట్లు విన్నాక రేషం ఉన్నోడైతే బిల్డింగ్ మీది నుంచి దూకి చస్తాడు. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతోంది. ఏడాది లోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఊహించలేదు. మనం పిలుపునిస్తే ఈ ప్రభుత్వానికి ప్రజలే సంవత్సరీకం పెట్టే పరిస్థితి ఉంది. అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు గ్రామగ్రామాన కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు..'' అన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా కాంగ్రెస్‌ను ఎప్పుడు పాతర పెడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. మనుషులుగా మనం కూడా తప్పులు, పొరపాట్లు చేసి ఉండవచ్చు. వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యమని అన్నారు.