కాంగ్రెస్ అసమర్థ పాలనలో మరో పేద బిడ్డ బలి : ఎమ్మెల్సీ కవిత
సీఎం రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలకు మరో పేద బిడ్డ బలి అయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా పేర్కొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనలో మరో పేద బిడ్డ బలి అయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసిందని ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా , పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసిందన్నారు. ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేని కవిత అన్నారు.
మరణించిన విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మీ, అనిల్ జాధవ్‌ను అడ్డుకోవడం దురదృష్టకరమని వెల్లడించారు. రాజ్యాంగ దినోత్సవం నాడే రాజ్యాంగ హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. శైలజ మృతదేహం ఆసిఫాబాద్ జిల్లా బాదా గ్రామానికి చేరుకున్నది. దీంతో ఆమె బంధువుల, గ్రామస్తులు అంబులెన్స్‌ను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆమె డెడ్‌బాడీని అందులోని నుంచి దించకుండా అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అడుగడుగునా మోహరించారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు. సరైన ధృవపత్రాలు చూపిన తర్వాతే గ్రామానికి అనుమతిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు విధించారు.