రాజ్యాంగ స్ఫూర్తిని చాటేలా పాలన చేయండి

లేకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు.. సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఓపెన్‌ లెటర్‌

Advertisement
Update:2024-11-26 19:44 IST

భారత రాజ్యాంగ స్ఫూర్తిని చాటేలా పరిపాలన సాగించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. ఇప్పటికైనా నియంతృత్వ ధోరణి వీడాలని హితవు పలికారు. నియంతృత్వ ధోరణి మారకుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ ఓపెన్‌ లెటర్‌ రాశారు. ఆయన రాసిన లేఖ యథాతథంగా..

జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ ఓపెన్ లెటర్ ద్వారా తెలంగాణలో మీ రాజ్యాంగ వ్యతిరేక పాలనను తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నాను. మీ పాలనలో పౌరుల హక్కులను తొక్కేస్తూ, రాష్ట్ర ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగిస్తోంది. ఒకవైపు మీ నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెబుతారు. కానీ, మీ ప్రభుత్వం అన్ని రాజ్యాంగ ప్రమాణాలను, విలువలను స్ఫూర్తిని పూర్తిగా ఉల్లంఘిస్తోంది. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌కు గౌరవ సూచకంగా కే‌సీఆర్ ప్రభుత్వం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా సాధ్యమైందని ప్రతి తెలంగాణ పౌరుడు అంబేద్కర్‌కు రుణపడి ఉంటారు. అయితే, కే‌సీఆర్‌పై మీకున్న వ్యక్తిగత వ్యతిరేకతతో మీరు ఆ విగ్రహాన్ని గౌరవించకపోవడం చూసి చాలా బాధ కలుగుతోంది. ఇది భారత రాజ్యాంగ రూపకర్తకు నేరుగా మీరు చేస్తున్న అవమానమని గుర్తుంచుకోవాలి.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. దొడ్డిదారిన మా పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి చేర్చుకోవడమే కాకుండా, యాంటీ-డిఫెక్షన్ చట్టాన్ని విస్మరించి, బీఆర్ఎస్ నుంచి చట్ట వ్యతిరేకంగా వచ్చిన ఎమ్మెల్యేలకు మీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇస్తోంది. భారత రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కుల్లో ప్రసంగ స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)(ఎ)) కీలకమైనది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హక్కును తొక్కి పెట్టడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. ప్రజాపాలన పేరుతో మీరు అరాచక పాలనను అమలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం తప్పులను ప్రశ్నించే వారిపైన, చివరికి సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం అయినా సరే, వారిపై తప్పుడు కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. మీ పాలనను వ్యతిరేకించే పోస్టులకు సంబంధించి గ్యాంగ్‌స్టర్, దేశద్రోహం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. పత్రికా స్వేచ్ఛ వాక్ స్వాతంత్రంలో కీలకమైనది, తెలంగాణలో ఇది కూడా దాడులకు గురవుతోంది. మీడియా ప్రతినిధులపై శారీరక దాడులు, తప్పుడు కేసులు నమోదు చేయడం మీ ప్రభుత్వం అరాచక తత్వాన్ని బహిర్గతం చేస్తోంది.

మీ 11 నెలల పాలనలో పోలీసుల వేధింపులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. గత 11 నెలల మీ పాలనలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకుని మానసిక, శారీరక వేధింపులకు గురిచేసిన అనేక ఘటనలు వెలుగు చూశాయి. మీ పాలన కింద తెలంగాణ ఒక పోలీస్ రాజ్యంగా మారింది. అంతటితో ఆగకుండా, మీ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా రాష్ట్ర పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన సోదరులు క్విడ్ ప్రో కో విధానంలో నేరుగా లబ్ధి పొందుతున్నారు. మీ ప్రభుత్వం కింద రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్న మరో ఉదాహరణగా హైడ్రా, ఇతర సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టం వచ్చిన విధంగా కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఈ విధమైన కూల్చివేతలను రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. మీరు ప్రజలకు “మార్పు” అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ మార్పు ఒక మోసమని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. సమాజంలోని వివిధ వర్గాలు మీ రాజ్యాంగ వ్యతిరేక, అసమర్థ పాలనను వ్యతిరేకిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

ఈ కీలకమైన జాతీయ రాజ్యాంగ దినోత్సవం రోజున, తెలంగాణలో రాజ్యాంగ పరిపాలనను పునరుద్ధరించమని మీకు తెలంగాణ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వానికి గౌరవం చూపించేలా రాజ్యాంగ హక్కులను, స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు పరిపాలన అందించాలని సూచిస్తున్నాను. ప్రజలు, మాలాంటి పార్టీలు పదే పదే మీ తీరు మార్చుకొని, ప్రజాస్వామికంగా వ్యవహరించాలని చేస్తున్న విజ్ఞప్తులను, డిమాండ్లను పట్టించుకోకుండా నియంతృత్వంతో, అప్రజాస్వామికంగా మీరు రాజ్యాంగ వ్యతిరేక పాలనను కొనసాగిస్తే, రాష్ట్ర ప్రజలు మీకు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News