ప్రజలకు క్షమాపణ చెప్పండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ ను నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామని చెప్పారు కేటీఆర్.
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ విషయంలో గతంలో ఇచ్చిన మాట తప్పినందుకు, అబద్ధాలు చెప్పినందుకు గాను.. ప్రజలను క్షమాపణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇదేమీ తాము కొత్తగా కోరుతున్నది కాదని, గతంలో సీఎం రేవంత్ సహా, ఆయన సహచర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అడుగుతున్నామని ఆ లేఖలో వివరించారు కేటీఆర్.
బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ దోపిడీ అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ దోపిడీ ఎలా కొనసాగిస్తారంటూ లాజిక్ తీశారు కేటీఆర్. ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో చెప్పాలన్నారు. అది దోపిడీ అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ ను నిరసన కార్యక్రమాలు, వినతి పత్రాల రూపంలో ప్రభుత్వానికి అందించామని చెప్పారు కేటీఆర్. ప్రజల ఆకాంక్షల మేరకే తమ డిమాండ్ ని నెరవేర్చాలని కోరుతున్నట్టు తెలిపారు. ఆమేరకు ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు విషయంలో వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు, వివిధ సందర్భాల్లో వారు చేసిన వ్యాఖ్యలను కూడా తన లేఖలో ప్రస్తావించారు కేటీఆర్.