చేనేతకు చేయూత ఇవ్వకుండా చావుదెబ్బ కొట్టారు..
కొవిడ్ కష్టకాలంలో చేనేత రంగానికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి కేటీఆర్. దేశంలో చేనేత రంగానికి అత్యథిక ప్రాధాన్యత ఇస్తోంది తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.
చేనేతకు చేయూత ఇవ్వాల్సిన కేంద్రం చావుదెబ్బ కొడుతోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఒక్క సంస్థను కూడా ఇవ్వలేదని, ఉన్నవి రద్దు చేసుకుంటూ పోతోందని విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో 8 సంస్థలను రద్దు చేసిన ఘనత మోదీకే దక్కుతుందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ ను ఆయన టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. చేనేత రంగం పట్ల, కార్మికుల కష్టాల పట్ల సమగ్ర అవగాహన రాపోలు ఆనంద్ భాస్కర్ కు ఉన్నాయని చెప్పారు కేటీఆర్.
బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకబాటు..
అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరతామంటూ ప్రధాని మోదీ గొప్పలు చెబుతున్నా.. మనకంటే తక్కువ జనాభా, తక్కువ అభివృద్ధి రేటు ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక కంటే ప్రస్తుతం మనం అధ్వాన్న స్థితిలో ఉన్నామంటూ చురకలంటించారు కేటీఆర్. భారత్ లో వ్యవసాయం తర్వాత అంతటి స్థాయి, పరిపుష్టి ఉన్న చేనేత రంగానికి మోదీ ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. చేనేత రంగానికి కనీసం ఒక పాలసీ కూడా రూపొందించలేదని చెప్పారు. దుస్తుల తయారీలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే వెనుకబడి ఉన్నామని వివరించారు.
చేనేత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో విధాల విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని అన్నారు కేటీఆర్. చేనేత కళాకారులకు కేంద్ర ప్రోత్సాహకాలు అందడం లేదని చెప్పారు. చేనేతలో పరుగులు పెడుతున్న రాష్ట్రాలకు సహకరించాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని, డీపీఆర్ ఇచ్చామని కానీ పట్టించుకోలేదన్నారు. అందుకే రాష్ట్ర స్థాయిలోనే చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, చేనేత లక్ష్మి పేరుతో వివిధ పథకాలను తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలను ఆదుకుంటోందని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో చేనేత రంగానికి రూ.100 కోట్లు కేటాయించామని తెలిపారు. దేశంలో చేనేత రంగానికి అత్యథిక ప్రాధాన్యత ఇస్తోంది సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. దేశంలో నేతన్నకు బీమా పేరుతో ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు కేటీఆర్.