బాధిత కుటుంబాలకు కేటీఆర్ పరామర్శ, ఆర్థిక సాయం..
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు 17మంది ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
హైదరాబాద్ లో ఇటీవల భారీ వర్షాలకు ఇద్దరు దుర్మరణం పాలయిన సంగతి తెలిసిందే. ఆ రెండు కుటంబాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరపున ఆ రెండు కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం చేశారు. ఆయా కుటుంబాలకు భవిష్యత్తులో కూడా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలతో కలసి నేరుగా ఆ కుటుంబాల వద్దకు వెళ్లి ఆర్థిక సాయం అందించి వచ్చారు కేటీఆర్.
హైదరాబాద్, హఫీజ్‌పేట్ లోని సాయి నగర్ లో వర్షానికి ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోగా.. వాటిపై ఉంచిన ఇటుక రాళ్లు నేరుగా ఇంటిలో ఉన్న పిల్లవాడిపై పడ్డాయి. ఇటుకరాళ్లు పడటంతో ఇంటిలో ఉన్న మూడేళ్ల చిన్నారి సమద్ కి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందించేలోగా సమద్ మృతి చెందాడు. చిన్నారి మృతితో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయం అందించారు. గాలివాన బాధితులైన న్యాయవాది రషీద్ కుటుంబానికి కూడా కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
మరోవైపు ప్రభుత్వం కూడా వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలని కోరారు కేటీఆర్. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు 17మంది ప్రాణాలు కోల్పోయారని, వారందరికీ ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు.