BJ...EC-CBI-NIA-IT-ED...P బీజేపీకి కొత్త పేరు పెట్టిన కేటీఆర్
కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఎన్నికల కమిషన్ కంటే ముందే బీజేపీ నేతలు ఎలక్షన్ తేదీలపై ఎలా హింటిచ్చారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక. శనివారం ఈ వార్త తెలంగాణలో హాట్ టాపిక్. ఈ ప్రకనట విడుదల చేసింది ఎన్నికల కమిషన్ కాదు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. ఎన్నికలకు ఇంకా 40 రోజులే టైమ్ ఉందని, స్థానిక నాయకులు ఇక సీరియస్‌గా పనిచేయాలని ఉపదేశించారు. అసలు ఎన్నికల కమిషన్ కంటే ముందు బీజేపీ నాయకులు ఎన్నికలపై ప్రకటన చేయడమేంటి..? ఫలానా టైమ్‌లో ఉప ఎన్నిక జరుగుతుందంటూ, 40 రోజుల కౌంట్ డౌన్‌ని ప్రకటించడం ఏంటి..? అసలు ఈసీ గుట్టు బీజేపీకి ఎలా తెలిసింది..? ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ వేసిన పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈసీ కంటే ముందు బీజేపీ ఎన్నికల తేదీలు ప్రకటిస్తుంది..
ఈడీ కంటే ముందు బీజేపీ నోటీసులు అందుకునేవారి పేర్లు చెబుతుంది..
ఎన్ఐఏ కంటే ముందు ఏయే సంస్థలపై నిషేధం ఉంటుందో బీజేపీ ప్రకటిస్తుంది.
ఐటీ రైడ్స్ కంటే ముందే ఎంత సొమ్ము సీజ్ చేశారో బీజేపీ చెప్పేస్తుంది.
సీబీఐ కంటే ముందే బీజేపీ నిందితులెవరో పసిగడుతుంది.
ఇంత ఘనత సాధించిన బీజేపీ పేరు ఇక BJP కాదని దాన్ని కచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్. "BJ...EC-CBI-NIA-IT-ED...P" గా బీజేపీ పేరు మార్చాలంటూ సెటైర్లు వేశారు. BJP మధ్యలో EC-CBI-NIA-IT-ED ఇవన్నీ ఉన్నాయని అన్నారు.
కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అసలు ఎన్నికల కమిషన్ కంటే ముందే బీజేపీ నేతలు ఎలక్షన్ తేదీలపై ఎలా హింటిచ్చారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కేటీఆర్ చెప్పిన ఉదాహరణలన్నీ సరైనవేననడానికి ఇటీవలే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ.. చివరకు ఈసీ నిర్ణయాలు కూడా బీజేపీ ముందుగానే ప్రకటిస్తుండటం విశేషం.