కేంద్ర మంత్రికి దిమ్మతిరిగే జవాబిచ్చిన కేటీఆర్..

తెలంగాణకు మెడికల్ కాలేజీల కేటాయింపు విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రికి దిమ్మతిరిగే జవాబిచ్చారు. అసత్యాలు చెప్పిన కేంద్రమంత్రికి కేటీఆర్ రుజువులతో షాక్ ఇచ్చారు.

Advertisement
Update:2022-08-29 22:14 IST

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్లో దిమ్మతిరిగే జవాబిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్. మెడికల్ కాలేజీలకోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదనలేవీ రాలేదని అంటున్న కేంద్ర మంత్రికి సాక్ష్యాధారాలతో షాకిచ్చారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రులు గతంలో కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు తిరిగి జవాబిచ్చిన కేంద్ర మంత్రుల లేఖల‌ ప్రతులను ఆయన తన ట్వీట్ కి జత చేశారు.. అందులో2015 లో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ పంపిన అభ్యర్థనకు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇచ్చిన జవాబు,2019 లో అప్పటి ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి రాసిన లేఖకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన జవాబు లేఖలున్నాయి. కేసీఆర్ ఆదేశాలతో మెడికల్ కాలేజీలకోసం కేంద్రానికి అభ్యర్థనలు పంపారు. ఈటల‌ పార్టీమారారు కానీ, కేంద్రం మనసు మారలేదు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు.

ఆగండాగండి.. అయిపోలేదు..

మీరు తేరుకుని జవాబిచ్చేలోగా మీకు మరో ప్రశ్న సంధిస్తున్నానంటూ మరో ట్వీట్ వేశారు కేటీఆర్. యూపీఏ హయాంలో తెలంగాణకు AIIMS మంజూరైందని, కనీసం దానిలో ఉన్న 544 ఖాళీలను కూడా బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని చెప్పారు. అందుకే మీ ప్రభుత్వాన్ని NPA అంటున్నామని చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వం నిరంతరం మెడికల్ కాలేజీలకోసం అభ్యర్థనలు పంపించిందని, కానీ కేంద్రం జీరో డెలివరీ చేసిందని ఎద్దేవా చేశారు.

ఎందుకీ మాటల యుద్ధం..

తెలంగాణ మెడికల్ కాలేజీల విషయంపై కేటీఆర్ రీసెంట్ గా ఓ ట్వీట్ వేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014కి ముందు తెలంగాణలో గత 67 ఏళ్లలో కేవలం 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 8 సంవత్సరాలలో, 16 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని చెప్పారు కేటీఆర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున మరో 13 ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఘనతేనని, కేంద్రం ఒక్క కాలేజీ కూడా మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. దీనిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ.. తెలంగాణ నుంచి అభ్యర్థనలే రాలేదని బుకాయించారు. అయితే కేటీఆర్, గతంలో రాష్ట్ర మంత్రులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రులిచ్చిన జవాబుల‌ కాపీలను జతచేస్తూ కేంద్ర మంత్రికి తిరుగులేని సమాధానమిచ్చారు. ఎన్డీఏ హయాంలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు సహా.. ఐఐఎం, ఐఐటీ, ట్రిపుల్ ఐటీలు కూడా ఏర్పాటు చేశారని తెలంగాణకు మాత్రం సున్నా చుట్టారని ఎద్దేవా చేశారు. కనీసం విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మన్సుఖ్ మాండవీయ ట్వీట్ తోపాటు, కేటీఆర్ సమాధానం కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.



Tags:    
Advertisement

Similar News