పెట్రోల్ ధరలు తగ్గించండి... మోడీని డిమాండ్ చేసిన కేటీఆర్

పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని ప్రధాని మోడీని తెలంగాణ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకపోవడం పట్ల ఆయన మండిపడ్డారు.

Advertisement
Update:2022-08-24 20:37 IST

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించాలని, ఆ భారం నుంచి ప్రజలను విముక్తి చేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు కేటీఆర్. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలే మన దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు కారణమన్న మోదీ ప్రభుత్వం సాకు తప్పని మరోసారి రుజువైందన్నారు.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుండి బీజేపీ అసమర్థ విధానాలు, అసమర్ద‌ పాలన వల్ల పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నా కేంద్రం అనేక రకాల‌ సెస్‌ల వసూళ్ల ద్వారా దేశ ప్రజలను దోచుకుంటోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 95 డాలర్లకు పడిపోయినప్పటికీ, దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను తదనుగుణంగా సవరించడం లేదని ఆయన మండిపడ్డారు.

పార్లమెంటులో కేంద్రం స్వయంగా ప్రకటించిన దానిప్రకారమే పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, సెస్ ల రూపంలో దేశ ప్రజల నుండి 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని, ఆ సొమ్మును ప్రధానమంత్రి తన స్నేహితుల కార్పొరేట్ రుణాలను మాఫీ చేసేందుకు వినియోగించుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.

"కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నులు, సెస్ వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటోంది. అంతేకాకుండా, పెట్రోల్ ధరలపై పన్నులు పెంచని తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తోంది, "అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ కేంద్రం పెంచిన ధరలను నామమాత్రంగా తగ్గించిందని ఇది వంచన తప్ప మరొకటి కాదని కేటీఆర్ ద్వజమెత్తారు.

దేశంలో భారీ ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ అనంతర ప్రభావాల నేపథ్యంలో, కేంద్రం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, సెస్‌లను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News