ఆ మాట నిలబెట్టుకోవాలి..కాంగ్రెస్‌కు కేటీఆర్ సవాల్‌

మేనిఫెస్టోలో చెప్పిందే నిజమైతే పార్టీలో చేర్చుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదా స్పీకర్‌తో అనర్హులుగా ప్రకటించాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్.

Advertisement
Update:2024-04-06 10:14 IST

రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం శుక్రవారం కాంగ్రెస్‌ మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వస్తే పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ చాప్టర్‌లోని 13వ పాయింట్ ప్రకారం.. ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారితే.. వెంటనే సభ్యత్వం పోయేలా చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టింది.


అయితే ఇదే అంశంపై సెటైరికల్‌గా ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇండియాలో పార్టీ ఫిరాయింపులు, ఆయా రామ్, గయారామ్‌ సంస్కృతిని ప్రోత్సహించిన మాతృసంస్థ కాంగ్రెస్‌ ఇప్పుడు పెద్ద మనసు చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు కేటీఆర్. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఫిరాయిస్తే అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్ సవరించాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు.

కానీ, కాంగ్రెస్‌ చెప్పేదానికి ఆచరించేదానికి చాలా తేడా ఉంటుందన్నారు కేటీఆర్. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చి.. మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిందే నిజమైతే పార్టీలో చేర్చుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదా స్పీకర్‌తో అనర్హులుగా ప్రకటించాలని రాహుల్‌గాంధీని డిమాండ్ చేశారు కేటీఆర్. చెప్పింది చేస్తామని నిరూపించుకోవాలని రాహుల్‌కు సవాల్ విసిరారు.

Tags:    
Advertisement

Similar News