సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాట తప్పుతారా..? ఈడీ అధికారులపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు ఆదేశాలివ్వడం సరికాదన్నారు కేటీఆర్. తమ లాయర్‌ను కూడా లోపలికి అనుమతించడం లేదని చెప్పారు.
కేసు విచారణ దశలో ఉండగా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దశలో ఆమెను అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టుకి ఈడీ అధికారులు ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేశారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చామని చెప్పి చివరకు అరెస్ట్ చేస్తున్నామని సడన్ గా ప్రకటించడం సరికాదన్నారు. ఈడీ అధికారుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ ఎలా చేస్తారని నిలదీశారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, సుప్రీంకోర్టుకు ఇచ్చిన మాటను మీరి.. కవితను అరెస్ట్ చేస్తే అధికారులు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంటారని కేటీఆర్ హెచ్చరించారు. సెర్చ్ వారెంట్ ఇచ్చి సోదాలు పూర్తిచేశామని, అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నామని ఈడీ అధికారిణి భానుప్రియ మీనా మేడమ్ చెబుతున్నారని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. కావాలనే కవితను అరెస్ట్ చేశారని ఈడీ అధికారుల తీరుని తప్పుబట్టారు కేటీఆర్.
సోదాలు పూర్తయిన తర్వాత కూడా కుటుంబసభ్యులు ఇంట్లోకి రావద్దని అధికారులు ఆదేశాలివ్వడం సరికాదన్నారు కేటీఆర్. తమ లాయర్‌ను కూడా లోపలికి అనుమతించడం లేదని చెప్పారు. కావాలనే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఓ వ్యూహం ప్రకారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టి చివరకు అరెస్ట్ చేశామంటున్నారని, ఈడీ అధికారుల తీరు సరిగా లేదని మండిపడ్డారు కేటీఆర్.