బీఆర్‌ఎస్ నేత సుంకె రవి శంకర్ ఇంటిపై దాడిని ఖండించిన కేటీఆర్
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని కేటీఆర్ ఖండించారు.
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తల జరిపిన దాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తమ నాయకుడి ఇంటిపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ నేతల ఇండ్లపై దాడులు చేస్తూ అరాచకం సృష్టించే కుట్రను రేవంత్‌రెడ్డి ముఠా చేస్తుందన్నారు. ఇలాంటి అరాచకాలు, బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ మోసాలను, అవినీతిని ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇప్పటికైనా దాడులకు ముగింపు పలకకుంటే కాంగ్రెస్ గుండాలకు గుణపాఠం తప్పదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు ఇన్ని దాడులకు తెగబడుతూ.. శాంతి భద్రతల సమస్యగా మారినా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాంటి అల్లరి మూకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ కోరారు.