చేతిలో రూపాయి పారేసి చిల్లర ఏరుకోవద్దు - కేటీఆర్
కేంద్రమంత్రులు టాయిలెట్స్, రైల్వే స్టేషన్లలోని లిప్ట్ ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్నారని, తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రజలకు సూటిగా ఒకటే విన్నపం చేశారు మంత్రి కేటీఆర్. చేతిలో రూపాయి పడేసి చిల్లర ఏరుకోవాలనుకోవద్దని కోరారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం తనకు ఉందన్నారు. భారత రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, 90 నుంచి 100 అసెంబ్లీ స్థానాల్లో సులభంగా గెలుస్తుందని చెప్పారు. మరోసారి తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని, దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్ విసిరారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలన్న స్పూర్తికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేసి విజయం సాధించిందని గుర్తు చేశారు కేటీఆర్. గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, అగ్రవర్గాలు, అణగారిన వర్గాలనే భేదం లేకుండా సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందనేది నినాదంగా మారిందన్నారు. ప్రతిపక్షాలకు తెలంగాణలో పని లేకుండా పోయిందని చెప్పారు. పనిలేక తొమ్మిదేళ్లుగా అసత్య అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఒక్కసారి కూడా హేతుబద్దంగా, రుజువులతో మాట్లాడలేక పోయారని చెప్పారు.
బేరీజు వేసుకోండి..
ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిపాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఎలాంటి పరిమితులు లేకుండా పండించిన పూర్తి ధాన్యాన్ని కొంటున్న రాష్ట్రం దేశంలో ఇంకొకటి ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ కంటే ఉత్తమ పాలన ఉన్న రాష్ట్రం ఏదో కాంగ్రెస్, బీజేపీ నేతలు చూపించాలన్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలను తెలంగాణ కంటే గొప్పగా అభివృద్ధి చేసుకోలేని కాంగ్రెస్, బీజేపీ.. ఇక్కడ అధికారంలోకి ఎలా వస్తాయని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఆ రెండు పార్టీలు 75 సంవత్సరాల్లో చేయని పనిని, కేవలం 9 ఏళ్లలో బీఆర్ఎస్ చేసి చూపించిందన్నారు.
ఎంఐఎంకి చురకలు..
తెలంగాణ రాష్ట్రం మైనార్టీలకు చేసిన కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన విషయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మరచిపోవద్దన్నారు కేటీఆర్. ఆయన ఇక్కడ మాట్లాడింది నిజమా..? అక్కడ మాట్లాడింది నిజమా..? అయనే తేల్చుకోవాలన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది అ పార్టీ ఇష్టం అన్నారు. ప్రజలు మత ప్రాతిపదికన ఓట్లు వేస్తారని తాను నమ్మబోనన్నారు.
కేంద్రమంత్రులు టాయిలెట్స్, రైల్వే స్టేషన్లలోని లిప్ట్ ల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ కాలక్షేపం చేస్తున్నారని, తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేనే లేదని, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే అప్పుడప్పుడు ఆ పార్టీ నేతలు హంగామా చేస్తుంటారని చెప్పారు.
దక్షిణాది నష్టపోతే ఎవరూ సహించరు..
సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది తన వాదన కూడా కాదని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. అయితే జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తన వాదన అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండటం సమంజసం కాదన్నారు. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి వస్తే ఎవరూ సహించరని హెచ్చరించారు. లోక్ సభ స్థానాలు పెంపుపై ఇప్పటినుంచే ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
అందరివీ భ్రమలే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పోటీ పడే పరిస్థితి లేదన్నారు మంత్రి కేటీఆర్. అధికారంలోకి వస్తామంటు కాంగ్రెస్ పార్టీ భ్రమల్లో ఉంటే అది వాళ్ళ ఇష్టం అన్నారు. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో సంస్థని, లేదా దుకాణాన్ని నడపాలని చెప్పారు. గుజరాత్ లో ఎన్నికలు జరిగితే రాహుల్ పారిపోయారని గుర్తు చేశారు. దేశంలో అత్యుత్తమ ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావుకి ఢిల్లీలో సమాధి లేకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని ఆరోపించారు.
మోదీని ఇంటికి పంపించాలి..
నోట్లు రద్దుతో ఏం సాధించారనే విషయంపై ఇప్పటి వరకూ మోదీ వద్ద సమాధానం లేదన్నారు కేటీఆర్. ఇప్పుడు 2000 నోట్ల మార్పిడితో సాధించేది ఏంటో కూడా ప్రజలకు చెప్పడం లేదన్నారు. ధరల పెరుగుదల నుంచి అన్ని రంగాల్లో విఫలమైన మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఏపీలో కూడా బీఆర్ఎస్ పని ప్రారంభించిందని గుర్తు చేశారు కేటీఆర్. బాగా పనిచేసిన వారందరికీ తిరిగి ఎమ్మెల్యే సీట్లు దక్కుతాయన్నారు కేటీఆర్. ఆరు నెలలు సమయం ఉందని, వెనుకబడిన ఎమ్మెల్యేలు తమ ప్రదర్శన మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం విదేశీ పర్యటనలు చేసి ఉద్యోగాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, తాజా పర్యటనలో 42 వేల ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణకు తీసుకురాగలిగామని చెప్పారు కేటీఆర్. సచివాలయ నిర్మాణం, వ్యాక్సిన్ల తయారీ లాంటి అంశాల నుంచి కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయని, కానీ దేన్నీ నిరూపించలేకపోయారని చెప్పారు. ప్రతిపక్షాల వద్ద రుజువులు ఉంటే కోర్టుకి సమర్పించాలని, ప్రజల ముందు పెట్టాలన్నారు.