ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలిచ్చిందని యువత చెబితే తాను అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు కేటీఆర్. అదే జరిగితే లక్షమందితో కాంగ్రెస్ నేతలకు పౌర సన్మానం కూడా చేయిస్తామన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30వేల ఉద్యోగాలు ఇచ్చామని నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ అవి వారు ఇచ్చినవి కావని వివరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము నోటిఫికేషన్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. నియామకపత్రాలు చేతిలో పెట్టి, ఉద్యోగాలు తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ బిల్డప్ ఇస్తోందని మండిపడ్డారు కేటీఆర్.
అసెంబ్లీ అయిపోయిన తర్వాత అశోక్ నగర్ కి వెళ్లి అక్కడి పిల్లల్ని వాస్తవాలు అడుగుదామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు సూచించారు కేటీఆర్. అక్కడ ఉన్న ఏ ఒక్క యువకుడు, యువతి అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలిచ్చిందని చెబితే తాను అక్కడే రాజీనామా చేసి వెళ్లిపోతానన్నారు. అదే జరిగితే లక్షమందితో కాంగ్రెస్ నేతలకు పౌర సన్మానం కూడా చేయిస్తామన్నారు కేటీఆర్.
కేటీఆర్ సవాల్ కు కాంగ్రెస్ నేతలు బదులివ్వలేకపోయారు కానీ, మంత్రి సీతక్క మాత్రం స్పందించారు. గత ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల వేళ నోటిఫికేషన్లు ఇచ్చేదని, ఎన్నికలు పూర్తయ్యాక వాటిని పట్టించుకోలేదని అన్నారు సీతక్క. ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని ఆమె ప్రశ్నించారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు నష్టం జరిగిందన్నారు. తమకు ఇంకా టైమ్ ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు సీతక్క.