రైతులపై కోపం వద్దు, రాష్ట్రంపై పగ పట్టొద్దు
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని అన్నారు కేటీఆర్. మేడిగడ్డకు మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారని.. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
రైతులపై కోపం వద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. రాష్ట్రంపై పగ పట్టొద్దని సూచించారు. పగ, కోపం ఉంటే రాజకీయంగా తమపై తీర్చుకుంటే ఇబ్బంది లేదని.. ప్రజలపై చూపెట్టొద్దని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పై మండిపడ్డారు.
ఈరోజు ఉదయం తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ సందర్శనకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వెళ్లింది. మేడిగడ్డకు సంబంధించి 1.6 కిలోమీటర్ల బ్యారేజ్‌లో 50 మీటర్ల ప్రాంతంలో సమస్య ఉందని తెలిపారు కేటీఆర్. ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం, గుండ్లవాగు రెండుసార్లు కొట్టుకుపోయాయని గుర్తు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వచ్చాయని.. అప్పుడు తాము రాజకీయం చేయలేదని చెప్పారు. నిపుణుల సలహాలు తీసుకుని మేడిగడ్డను పునరుద్ధరించాలని కోరుతున్నామని పేర్కొన్నారు కేటీఆర్.
తప్పుడు ప్రచారం..
మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూస్తున్నారని అన్నారు కేటీఆర్. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే నిష్ఫలమైందని, దాని ద్వారా లక్ష కోట్ల రూపాయలు కొట్టుకుపోయాయని దుష్ర్పచారం చేయడం సరికాదన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెప్పారని.. అధికారులు, నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి, దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలన్నారు కేటీఆర్. మేడిగడ్డ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.